క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పార్కులో వనమహోత్సవం కార్యాక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈరోజు(గురువారం) సాయంత్రం 4 గంటలకు నాగలింగం మొక్కను నాటి వనమహోత్సవాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా వనమహోత్సవం ప్రాధాన్యాన్ని రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలియజేశారు. మొక్కవోని పట్టుదలతో గత విధ్వంస సంఘటనల జ్ఞాపకాల నుంచి తీసుకున్న సంకల్పానికి ఫలితమని చెప్పుకొచ్చారు.
పర్యావరణహితంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే యజ్ఞం..
‘ఈరోజు గుర్రంగూడలో ప్రారంభించే వనమహోత్సవానికి ఒక ప్రాధాన్యం ఉంది. ఇది కేవలం మొక్కుబడి కార్యక్రమం కాదు. ‘మొక్క’వోని పట్టుదలతో నిన్నటి విధ్వంస సంఘటనల జ్ఞాపకాల నుంచి తీసుకున్న సంకల్పానికి ఫలితం. చెరువుల కబ్జా, అటవీ భూములపై పంజా.. ఫలితంగా చినుకు పడితే హైదరాబాద్ అతలాకుతలం… ఇదీ గత పాలనా దృశ్యం. చెరువుల పరిరక్షణ, నాలాల పునరుద్ధరణ, అటవీ భూములపై న్యాయస్థానాల్లో కొట్లాడి విజయం సాధించి, పర్యావరణహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే యజ్ఞం.. ఇది నేటి పాలన దృశ్యం. 2021లో ఇదే గుర్రంగూడలో వరదల సమయంలో మల్కాజ్‌గిరి ఎంపీగా పర్యటించినప్పుడు నా మదిలో కలిగిన ఆవేదన నుంచి పుట్టిన ఆలోచనకు ఆచరణ ఈనాటి గుర్రంగూడ అటవీ భూమిలో జరిగే వనమహోత్సవం. ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన అనంతరం కబ్జాదారులపై న్యాయపోరాటం చేసి, అటవీ భూములను రక్షించి, నగరాన్ని వనంలో జనం జీవించే ప్రాంతంగా తీర్చిదిద్దే మా ప్రయత్నానికి ఈరోజు నిర్వహించే గుర్రంగూడ వనమహోత్సవం ఒక ఉదాహరణ’ అంటూ ఎక్స్‌లో రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.