Homeతెలంగాణటెక్నాలజీతో పాలన...  ‘ఈ-క్యాబినెట్‌’ నిర్వహణకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం

టెక్నాలజీతో పాలన…  ‘ఈ-క్యాబినెట్‌’ నిర్వహణకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలన వైపు మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాలను పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో తెలంగాణ డిజిటల్ కేబినెట్ అమలుకు అధికారికంగా ఆమోదం లభించింది. ఈ సందర్భంగా ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు అన్ని శాఖల మంత్రులకు ప్రత్యేక ట్యాబ్‌లను అందజేశారు. ఇకపై కేబినెట్ సమావేశాలకు సంబంధించిన ఎజెండా, నోట్లు, నిర్ణయాలు, సంబంధిత పత్రాలు అన్నీ ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారానే మంత్రులకు అందుబాటులో ఉండనున్నాయి. డిజిటల్ కేబినెట్ వ్యవస్థ అమలు తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ విధానం ద్వారా పేపర్ వినియోగం పూర్తిగా తగ్గడంతో పాటు నిర్ణయాల ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెరగడంతో పాటు సమాచారం భద్రత కూడా మెరుగుపడనుంది. పర్యావరణ పరిరక్షణ, పారదర్శకత, సాంకేతికత ఆధారిత పరిపాలన లక్ష్యాలతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పేపర్‌లెస్ గవర్నెన్స్‌లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర పరిపాలనలో ఆధునిక సాంకేతికత వినియోగానికి మరో మైలురాయిగా నిలవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు