•బిజెపి హవాకు చెక్ పెట్టేందుకు మమతా ప్రయత్నం
•బెంగాల్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యేందుకు వ్యూహం
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డిస్క్:- బెంగాల్లో మమతా బెనర్జీ సరికొత్త రాజకీయ వ్యూహం ప్రారంభించనున్నారా? అధికార బిజెపికి గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారా? ఏకంగా ఢిల్లీపై గురి పెట్టారా? కేంద్రంలో బిజెపి పతనాన్ని బలంగా కోరుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయింది. పదేళ్ల పి ఎం సి పాలనను తెరదించుతూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి మమతా బెనర్జీకి కష్టాలు మొదలయ్యాయి. అందుకే రాజకీయంగా మునుపటి దూకుడు ప్రదర్శించాలని మమతా బెనర్జీ స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
టీఎంసీ కి దెబ్బ మీద దెబ్బ..
బెంగాల్లో తృ ణమూల్ కాంగ్రెస్ ఓడిపోవడంతో ఆ పార్టీ ప్రాభవం తగ్గుతూ వస్తోంది. ఆ పార్టీ అడ్డగోలుగా చీలిపోయింది. మమతా బెనర్జీ నిర్ణయాన్ని కాదని ఆ పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు వేరొకరిని ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. అదే సమయంలో పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు సైతం రెబల్ వర్గం వైపు వెళ్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మమతా బెనర్జీని రాజకీయంగా దెబ్బతీయాలని బిజెపి భారీ వ్యూహంతోనే ఉంది. మమతా బెనర్జీ చుట్టూ ఉన్న ఆత్మీయులు, సన్నిహిత నేతలు ఆమెకు గుడ్ బై చెబుతున్నారు. ముఖ్యంగా మమత కంటే ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వైఖరిని నిరసిస్తూ ఎక్కువమంది పార్టీ నుంచి బయటకు వెళ్లి పోతున్నారు. ఈ తరుణంలో మమతా బెనర్జీ ఎన్ని రకాల సర్దుబాట్లు చేస్తున్నా అసమ్మతి తగ్గడం లేదు. తృణమూల్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలకు బిజెపి పరోక్ష కారణం అని మమతాకు తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మునుపటి దూకుడు ప్రదర్శించకపోతే రాజకీయాల్లో ఉనికి చాటుకోవడం కష్టం అని మమతా బెనర్జీ భావిస్తున్నారు. అందుకే ఆమె సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బిజెపిని దెబ్బతీయాలని..
మమతా బెనర్జీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కంటే.. ఢిల్లీ కోటపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. జాతీయస్థాయిలో బిజెపి హవాకు బ్రేక్ వేయాలని ఆమె భావిస్తున్నారు. బెంగాల్లో తనను ఓడించిన బిజెపిని జాతీయస్థాయిలో ఓడిస్తానని శపధం చేస్తున్నారు. లోక్సభలో అడుగుపెట్టి భారతీయ జనతా పార్టీని ఓ రేంజ్ లో ఆడుకోవాలని చూస్తున్నారు. అందుకే బెంగాల్ నుంచి లోక్ సభ ఉప ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నారు. ప్రధానంగా ఆమె బహరాంపూర్ లోక్సభ నుంచి ఎన్నిక కావాలని భావిస్తున్నారు. ఇక్కడ ప్రముఖ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ కావడంతో మమతా బెనర్జీ 2024 ఎన్నికల్లో పిలిచి మరీ టికెట్ ఇచ్చారు. పఠాన్ సైతం గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు. అయితే ఇప్పుడు పఠాన్ రాజీనామా చేస్తారని.. బై పోల్ లో మమతా బెనర్జీ పోటీ చేస్తారని ప్రచారం నడుస్తోంది. దీనిని పఠాన్ కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే అక్కడ మమతా గెలవడం అంత ఈజీ కాదు. కానీ అక్కడ గెలిచి సత్తా చాటాలని మమతా బెనర్జీ చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.