ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ క్రీడాకారిణి తన్వీ శర్మ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఆమె ప్రపంచ స్థాయి ప్రత్యర్థిని ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో తన్వీ శర్మ చైనీస్ తైపీకి చెందిన చియు పిన్ చియన్‌ను వరుస గేమ్‌ల్లో ఓడించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉన్న చియు ఈ టోర్నీలో ఐదో సీడ్‌గా బరిలోకి దిగింది. అయితే తన్వీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడి తొలి గేమ్‌ను 21-12తో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో కూడా గట్టి పోరాటం తర్వాత 22-20తో విజయం సాధించి తదుపరి రౌండ్‌కు అర్హత పొందింది.
ఈజీగా గెలిచిన పీవీ సింధూ
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా తన తొలి మ్యాచ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గెలుపొందింది. పెరూ క్రీడాకారిణి లుసియా కాస్టిల్లోపై ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 21-13, 21-11 స్కోరుతో సునాయాస విజయం అందుకుంది. ఇతర భారత మహిళా షట్లర్లు కూడా మంచి ఫలితాలు సాధించారు. మాళవిక బన్సోద్ తొలి గేమ్ కోల్పోయినప్పటికీ తిరిగి పుంజుకుని థాయ్ లాండ్‌కు చెందిన టన్‌రగ్ సహెంగ్‌పై విజయం సాధించింది. అలాగే ఇషారాణి చైనాకు చెందిన హాన్ కియాస్ ఝిపై మూడు గేమ్‌ల పోరులో గెలిచింది. తన్య కూడా అమెరికాకు చెందిన ఇషికాపై నేరుగా రెండు గేమ్‌ల్లో విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది. మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో భారత జోడీ ధ్రువ్-మనీష అద్భుత ఆటతీరుతో ఆస్ట్రేలియా జంట లిమ్ జైడెన్-విక్టోరియాను ఓడించింది. ఈ విజయంతో వారు కూడా తదుపరి దశలోకి అడుగుపెట్టారు.
పురుషుల సింగిల్స్ నిరాశ
అయితే పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. జార్జ్, తరుణ్ మన్నెపల్లి, దయానంద్ తమ తమ మ్యాచ్‌ల్లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. మొత్తంగా తొలి రోజు భారత షట్లర్ల ప్రదర్శన ఆశాజనకంగా ఉండగా, యువ క్రీడాకారిణి తన్వీ శర్మ సాధించిన విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.