HomeజాతీయంSuvendu Adhikari: సరిహద్దు భద్రతపై సువేందు సర్కార్ ఫుల్ ఫోకస్.. ఫస్ట్ మీటింగ్‌లో బిగ్ డెసిషన్స్!

Suvendu Adhikari: సరిహద్దు భద్రతపై సువేందు సర్కార్ ఫుల్ ఫోకస్.. ఫస్ట్ మీటింగ్‌లో బిగ్ డెసిషన్స్!

Bengal BJP Government Takes Big Decision: పశ్చిమబెంగాల్‌ లో తొలిసారి అధికారంలోకి వచ్చిన సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా బంగ్లాదేశ్ సరిహద్దులో మిగిలి ఉన్న ప్రాంతాల్లో కంచె నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన భూమిని బీఎస్‌ఎఫ్‌కు బదిలీ చేయాలని నిర్ణయించింది.

45 రోజుల్లో భూ బదిలీ ప్రక్రియ పూర్తి

పశ్చిమబెంగాల్‌కు బంగ్లాదేశ్‌తో సుమారు 2217 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఇందులో ఇప్పటికీ 569 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ పనులు పూర్తికాలేదు. దీంతో అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్ వంటి సమస్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భూమి బదిలీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, 45 రోజుల్లో పూర్తి చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. భూమి బదిలీ పూర్తయిన వెంటనే బీఎస్‌ఎఫ్ మిగిలిన ప్రాంతాల్లో కంచె నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తుందని సీఎం సువేందు అధికారి తెలిపారు. దీని వల్ల అక్రమ చొరబాట్లను గణనీయంగా తగ్గుతాయని ఆయన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు

ఇక కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై కూడా కొత్త ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్, పీఎం శ్రీ, పీఎం జన ఆరోగ్య యోజన, పీఎం ఫసల్ బీమా యోజన, పీఎం విశ్వకర్మ లాంటి పథకాలను అమలు చేయాలని క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వ కాలంలో అమలులో జాప్యం జరిగిన కొన్ని పథకాలను కూడా వేగంగా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా సోమవారం నుంచే రాష్ట్రంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) చట్టాన్ని అమలు చేస్తున్నట్టు సీఎం వెల్లడించారు. గత ప్రభుత్వం ఆలస్యం చేసిన జనగణన ప్రక్రియను కూడా తిరిగి ప్రారంభించనున్నట్టు చెప్పారు.

ఇప్పటికే ఉన్న పథకాలు కొనసాగింపు

రాష్ట్రంలో ఇప్పటికే అమలులో ఉన్న సంక్షేమ పథకాలను ఆపే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని సువేందు స్పష్టం చేశారు. అయితే, పథకాల పేరుతో అనర్హులు, మరణించిన వ్యక్తులు, భారతీయులు కాని వారు లబ్ధి పొందకుండా ప్రత్యేక పరిశీలన చేపడతామని తెలిపారు. దీంతో ప్రభుత్వ పథకాలు నిజమైన అర్హులకే చేరేలా చర్యలు తీసుకుంటామని సువేందు వెల్లడించారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు