HomeజాతీయంSuvendu Adhikari: బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి, ఇవాళే ప్రమాణస్వీకారం!

Suvendu Adhikari: బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి, ఇవాళే ప్రమాణస్వీకారం!

West Bengal New CM Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌ లో నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఖరారయ్యారు. ఈ మేరకు బీజేపీ అధినాయకత్వం అధికారిక ప్రకటన చేసింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి, పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించింది. ఈ విజయంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. శుక్రవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో సువేందు అధికారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. పార్టీ సీనియర్ నేత, బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆయన పేరును ప్రతిపాదించారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిశీలకుడిగా, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజి సహ పరిశీలకుడిగా హాజరయ్యారు.

అమిత్ షా ఏం చెప్పారంటే?

బెంగాల్ ముఖ్యమంత్రి ఎంపిక తర్వాత మాట్లాడిన అమిత్ షా కీలక విషయాలు వెల్లడించారు. బెంగాల్ ప్రజలు మార్పు కోసం బీజేపీకి మంచి మద్దతు ఇచ్చారని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా రాష్ట్రంలో భయానక రాజకీయ వాతావరణం కొనసాగిందని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన విమర్శించారు. అలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకం ఉంచి ప్రజలు బీజేపీకి అధికారాన్ని ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఇది సాధారణ ప్రభుత్వం కాదని, శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం అని అన్నారు.

భయానికి బదులుగా విశ్వాసం రావాల్సిన సమయం!

ముఖ్యమంత్రిగా ఎంపికైన సువేందు అధికారి కూడా భావోద్వేగంగా స్పందించారు. రాష్ట్రంలో భయానికి బదులుగా విశ్వాసం రావాల్సిన సమయం వచ్చిందన్నారు. తనపై నమ్మకం ఉంచిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. బెంగాల్‌లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో అమిత్ షా కీలక పాత్ర పోషించారని, ఆయనను ఆధునిక భారత రాజకీయాల్లో చాణక్యుడిగా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సువేందు అధికారి స్పష్టం చేశారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన కొద్ది గంటల్లోనే ఆయన గవర్నర్ ఆర్.ఎన్. రవిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు.

ఇవాళే ప్రమాణ స్వీకారం

ఇక కోల్‌ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌ లో ఇవాళ ఉదయం 11 గంటలకు సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అలాగే అగ్నిమిత్ర పాల్, శంకర్ ఘోష్‌లకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వొచ్చని సమాచారం.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు