విజయవాడ, క్రైమ్‌మిర్రర్: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాతుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తన వ్యాపారాల్లో తలమునకలై ఉన్నప్పటికీ తన కార్యాలయంలో ఎప్పుడూ సిబ్బందిని అందుబాటులో ఉంచుతూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. వారంలో రెండు రోజుల పాటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో టిక్కెట్లను ఇప్పించిన వ్యక్తి బీజేపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. గత ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానాన్ని సుజనా చౌదరి ఆశించారు.
కానీ తెలుగుదేశం పార్టీకి పొత్తులో భాగంగా వెళ్లింది. మరొకస్థానమయినా కేటాయిస్తారనుకున్నారు. కానీ చివరకు బీజేపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సుజనా చౌదరిని పరిమితం చేసింది. సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గానికే పరిమితమయినా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు.టీడీపీలో ఉన్న సమయంలో రాజ్యసభ సభ్యుడిగానూ, కేంద్ర మంత్రిగానూ పనిచేసిన సుజనా చౌదరి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా సర్దుకుపోతున్నారు. భవిష్యత్ తనకు అనుకూలంగా మారుతుందని లెక్కలు వేస్తున్నారు. ఎలాంటి వివాదాల జోలికి పోవడం లేదు. రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాల పట్ల కూడా ఆయన వ్యాఖ్యానించడం లేదు.
ఇటు టీడీపీకి అనుకూలంగా కానీ, అటు వైసీపీకి వ్యతిరేకంగా గాని ఎలాంటి ప్రకటనలు చేయకుండా సుజనా చౌదరి కొత్త పాలిటిక్స్ ను మొదలుపెట్టారంటున్నారు. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో తనకు చోటు దక్కుతుందని భావించినప్పటికీ అది దక్కలేదు. కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని మాత్రం వదలకుండా పట్టుకుని తిరుగుతున్నారురాజకీయాల్లో వేగంగా, ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని సుజనా చౌదరికి తెలుసు. అందుకే సమయం కోసం వెయిట్ చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తొలిసారి బీజేపీ గెలిచింది. టీడీపీ ఎప్పుడూ ఇక్కడ గెలవలేదు. టీడీపీ అస్సలు గెలవని చోట విజయం సాధించిన సుజనా చౌదరి ఈసారి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? లేక విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? అన్న చర్చ కూడా జరుగుతుంది. కృష్ణా జిల్లాకు చెందిన సుజనా చౌదరికి టీడీపీలోని అన్ని నియోజకవర్గాల నేతలతో ఇప్పటికీ సత్సంబంధాలున్నాయి. పొత్తులో భాగంగా ఈసారి విజయవాడ పార్లమెంటు స్థానాన్ని తీసుకుంటే తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లవచ్చని సుజనా చౌదరి ఆలోచనలో ఉన్నారట. అందుకే సమయం కోసం సుజనా వెయిట్ చేస్తున్నారంటున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాలి.