గుంటూరు, క్రైమ్ మిర్రర్: జిల్లాలో యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. తెనాలి రూరల్ పరిధిలోని కంచర్లపాలెం గ్రామ శివారులో ఈ ఘోరం చోటుచేసుకుంది. స్థానిక వాలీబాల్ కోర్టు వద్ద ఓ యువకుడు నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు భయాందోళనలకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే తెనాలి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని కోపల్లె కార్తీక్ (18)గా గుర్తించారు.
ఘటనా స్థలంలో ఉన్న పరిస్థితులను బట్టి, గుర్తుతెలియని దుండగులు వాలీబాల్ నెట్ వైరును కార్తీక్ గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ హత్య పాత కక్షల వల్ల జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.