Homeజాతీయంవిజయ్‌ ప్రభుత్వంపై స్టాలిన్‌ కీలక వ్యాఖ్యలు... మూన్నాళ్ల ముచ్చటేనా అంటూ కామెంట్‌...!

విజయ్‌ ప్రభుత్వంపై స్టాలిన్‌ కీలక వ్యాఖ్యలు… మూన్నాళ్ల ముచ్చటేనా అంటూ కామెంట్‌…!

చెన్నై, క్రైమ్ మిర్ర‌ర్‌: తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని విజయ్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పాటై సుమారు నెల రోజులు కావస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కూడా విజయ్‌ తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మెజార్టీ స్థానాలను సాధించలేకపోవడంతో విజయ్‌ కాంగ్రెస్‌ సహా మరికొన్ని పార్టీల మద్ధతును దక్కించుకునేందుకు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని పార్టీలు ఆయనకు మద్ధతు తెలియజేయడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విజయ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తోంది.

కీలక నిర్ణయాలు తీసుకుంటూ విజయ్‌ పాలనపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్‌ విజయ్‌ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం మూడు నెలలైనా కొనసాగుతుందా.? అన్న చర్చ ప్రజల్లో మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. తమ కూటమిలోని పార్టీల మద్ధతుతో ప్రస్తుత ప్రభుత్వం నడుస్తోందని పేర్కొన్న స్టాలిన్‌.. విజయ్‌ ప్రభుత్వ పనితీరును ఆరు నెలల వరకు విమర్శించకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించే పరిస్థితిని తీసుకువచ్చినట్టు తెలిపారు.

మూడు నెలలైనా ఉంటుందన్న చర్చ…

టీవీకే నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంపై రాష్ట్రంలోని ప్రజల్లో కీలక చర్చ జరుగుతోందని ఆయన తెలిపారు. ఓటర్లను కలవకుండా, బూత్‌ ఏజెంట్లను నియమించకుండా గెలిచిన పార్టీ ఎక్కువ రోజులు ఉంటుందని తాను అనుకోవడం లేదంటూ వ్యాఖ్యానించారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించడాన్ని అడ్డుకోవాలనే ఏకైక లక్ష్యంతో టీవీకేకు మద్ధతు ఇచ్చేందుకు తమ కూటమిలోని భాగస్వామ్యపక్షాలను అనుమతించినట్టు స్టాలిన్‌ వెల్లడించారు. తాము అలా చేయకపోతే తమిళనాడులో బీజేపీ పాలనకు మార్గం సుగమం అయ్యేదని, తమ కూటమిలోని పార్టీల మద్ధతుతోనే ప్రస్తుత ప్రభుత్వం నడుస్తోందని ఆయన పేర్కొన్నారు.

తాజాగా స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు వెనుక రాజకీయ కోణం ఉందా.? అన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పరిస్థితిని ఉద్ధేశించి స్టాలిన్‌ తాజా వ్యాఖ్యలు చేశారా.? లేక టీవీకేని కూల్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలోనే ఇలా మాట్లాడారా.? అన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. మరో రెండు నెలల్లో రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చేసుకుంటాయో అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అన్నామలై బీజేపీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతుండడం, తాజాగా స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలతో దేశ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా ఇప్పుడు తమిళనాడు నిలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు