Homeఆంధ్ర ప్రదేశ్జ‌న‌సేన‌లో ఏం జ‌రుగుతోంది... ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కమిటీలు రద్దుపై తీవ్ర‌మైన చ‌ర్చా...!

జ‌న‌సేన‌లో ఏం జ‌రుగుతోంది… ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కమిటీలు రద్దుపై తీవ్ర‌మైన చ‌ర్చా…!

నెల్లూరు, క్రైమ్ మిర్ర‌ర్‌: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీకి సంబంధించిన కీలక కమిటీలను రద్దు చేశారు. ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ ప్రకటించింది. తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ స్థాయిలో తీవ్ర నిర్ణయాన్ని పవన్‌ తీసుకోవడానికి కీలకమైన కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా పార్టీ నాయకత్వంలో క్రమశిక్షణ లోపించడం, పార్టీ విధి, విధానాలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు నేపథ్యంలోనే పవన్‌ కల్యాణ్‌ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెబుతున్నారు.

తాజా ఆరోపణలు నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న అన్ని కమిటీలను ఆయన రద్దు చేశారు. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. జిల్లాలోని పార్టీ నాయకులు, ఇప్పటి వరకు నియమించిన కమిటీలకు సంబంధించి పార్టీ మద్ధతుదారులు, జనసైనికులు నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన పవన్‌ కల్యాణ్‌.. వాటిలోని వాస్తవాలను పరిశీలించిన తరువాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. జనసేన సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై పార్టీని బలోపేతం చేశామని, కొందరు నాయకులు ప్రవర్తన ఆ లక్ష్యాలకు విరుద్ధంగా ఉంటోందని కొందరు కార్యకర్తలు పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకురావడం, వాటిని పరిశీలించిన తరువాత ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకోవడం చకచకా జరిగిపోయాయి.

నాయకుల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు…

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నాయకుల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నట్టు పవన్‌ కల్యాణ్‌ దృష్టికి వచ్చింది. అదేసమయంలో సమన్వయలోపం, క్రమశిక్షణారాహిత్యం కారణంగా పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు పవన్‌ గుర్తించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా, నగర, మండల, గ్రామ స్థాయి కమిటీలను రద్ధు చేస్తున్నట్టు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. అలాగే, జిల్లా సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న వారిలోతోపాటు కమిటీల్లో ఇతర సభ్యులను కూడా ఆయా బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు.

ఈ వ్యవహారంపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. క్రమశిక్షణ లేని చోట పార్టీ వ్యవస్థ సక్రమంగా నడవదని పేర్కొన్నారు. అందుకే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్టు వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం ప్రకాశం జిల్లా కమిటీని కూడా ఇదే కారణంతో రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొత్త కమిటీ నియామకం జరిగే వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ వ్యవహారాలను కేంద్ర కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుందని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. తాజా నిర్ణయం జనసేన పార్టీలో సంచలనం సృష్టిస్తోంది. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌గా తీసుకుంటున్నారనడానికి తాజాగా జరుగుతున్న పరిణామాలను పలువురు నాయకులు ఉదాహరణగా పేర్కొంటున్నారు.

తాజావార్తలు