-
50 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు
-
అభిషేక్ బెనర్జీ తీరుపై పార్టీలో తిరుగుబాటు
-
వామపక్షాలు మాదిరిగానే టిఎంసి బలహీనం
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ లో చీలిక ఖాయమా? ఆ పార్టీ నుంచి 50 మంది ఎమ్మెల్యేలు బిజెపిలోకి జంప్ చేస్తారా? అప్పుడే తిరుగుబాటు మొదలైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోయారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన మమత.. మూడోసారి మాత్రం చతికిల పడాల్సి వచ్చింది.
ఆందోళనకు ఆదరణ కరువు…
భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టాక.. ఎంత మాత్రం అవకాశం ఇవ్వకూడదు అని భావించారు మమతా బెనర్జీ. ప్రభుత్వంపై ఆందోళన కార్యక్రమాలు మొదలుపెట్టారు. నిన్ననే భారీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. 80 మందికి పైగా ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 50 మంది ఈ ఆందోళన కార్యక్రమాలకు గైర్హాజరయ్యారు. మరోవైపు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పెత్తనాన్ని ప్రశ్నిస్తూ అప్పుడే పార్టీలో నిలదీతలు మొదలయ్యాయి. ఒకవైపు బిజెపి ప్రభుత్వం దూకుడు.. ఇంకోవైపు పార్టీలో కుమ్ములాటలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మమతా బెనర్జీ చేయి దాటి పోతోంది. మున్ముందు ఇంకా పార్టీ సంక్లిష్ట స్థితికి చేరుకునే అవకాశం ఉంది.
అప్పట్లో వామపక్షాలపై ఉక్కు పాదం…
ఒకప్పుడు వామపక్షాలను ఏ స్థాయిలో మమతా బెనర్జీ వెంటాడారో.. ఇప్పుడు అదే స్థాయిలో టార్గెట్ కాబోతోంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. 37 సంవత్సరాల వామపక్షాల కోటను కూల్చారు మమతా బెనర్జీ. ఈ క్రమంలో ఆమె దూకుడు రాజకీయం అంతా ఇంతా కాదు. వామపక్షాల కోటను కూల్చే క్రమంలో ఆమె చూపిన శ్రద్ధ.. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రూపంలో బాధిత పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ మిగిలింది. ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యం కావాలన్న ఆలోచనలో ఉంది బిజెపి. అందుకు అవసరమైన ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోదు.