క్రైమ్ మిర్రర్ : ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ గుర్తింపులతో పలువురు మహిళలను పెళ్లి చేసుకుని, వారిని ఆర్థికంగా మోసం చేసిన వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించనని బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. సేవత నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ ఆగస్టు 6న సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. తన కుమార్తె ప్రజ్ఞకు 2024లో ప్రఖర్ త్రివేదితో వివాహం జరిగినట్లు అందులో తెలిపారు. మిశ్రిఖ్‌లోని చంద్రవాల్ ప్రాంతానికి చెందిన అనుజ్ త్రివేది కుమారుడే ప్రఖర్ అని పేర్కొన్నారు. వివాహ సమయంలో అనుజ్ త్రివేది తనను ముంబైకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పరిచయం చేసుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. అయితే అతడి గత చరిత్ర, గతంలో నమోదైన కేసుల గురించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపారు.
రెండున్నరేళ్ల తర్వాత అనుమానాలు
వివాహం జరిగిన కొంతకాలానికి ప్రఖర్, అతడి కుటుంబానికి సంబంధించిన కొన్ని అనుమానాస్పద విషయాలు తమ దృష్టికి వచ్చినట్లు జ్ఞాన్ తివారీ తెలిపారు. సోషల్ మీడియాతో పాటు ఇతర మార్గాల ద్వారా సమాచారం సేకరించిన తర్వాత ఈ వ్యవహారం గురించి తెలుసుకున్నామని చెప్పారు. ప్రఖర్ త్రివేది వేర్వేరు పేర్లు, గుర్తింపులు ఉపయోగించి పలు రాష్ట్రాల్లో మహిళలను పరిచయం చేసుకుని వివాహాలు చేసుకున్నాడని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇప్పటివరకు సుమారు 25 మంది మహిళలను వివాహం చేసుకున్నట్లు తమకు సమాచారం అందిందని, ప్రేమ పేరుతో భారీ మొత్తంలో డబ్బు కూడా మోసం చేసినట్లు ఆరోపించారు. ఈ విషయాలు తెలిసిన తర్వాత ప్రఖర్ కుటుంబంతో తమకు ఉన్న సంబంధాలను పూర్తిగా తెంచుకున్నామని జ్ఞాన్ తివారీ తెలిపారు. తన కుమార్తెను కూడా తిరిగి ఇంటికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
పోలీసులను ఆశ్రయించిన ఎమ్మెల్యే
ఈ ఘటన తమ కుటుంబాన్ని తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా తన ప్రతిష్ఠకు కూడా నష్టం కలిగిందని పేర్కొన్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా అనుజ్ త్రివేది, ప్రఖర్ త్రివేదిపై పోలీసులు మోసం కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు రేయుసా పోలీసులు తెలిపారు. ఈ కేసులో వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ప్రఖర్ గత వివాహాలు, మహిళల నుంచి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు, అతడి కుటుంబ నేపథ్యం తదితర అంశాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
