క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం ఉన్నప్పటికీ, భర్త వేధింపుల కారణంగానే ఈ ఘటన జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని కూడా వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన నరసింహస్వామి, పద్మ దంపతుల కుమార్తె హేమ (28)కు గత ఏడాది మార్చిలో మీర్‌పేట్ పరిధిలోని అల్మాస్‌గూడ, వినాయక హిల్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాజ్‌కుమార్‌తో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజులకే రాజ్‌కుమార్ తనకు మరో యువతితో ప్రేమ సంబంధం ఉందని చెబుతూ హేమతో తరచూ గొడవపడేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆమెను మానసికంగా వేధించడంతో పాటు ఓసారి గొంతు నులిమి చంపేందుకు కూడా ప్రయత్నించాడని వారు పేర్కొన్నారు. హేమ సంపాదించే జీతంతోనే ఇంటి అవసరాలు తీర్చుకునేవాడని, అయితే తన జీతం వివరాలను మాత్రం రాజ్‌కుమార్ ఎప్పుడూ చెప్పేవాడు కాదని తెలిపారు.
అంతేకాకుండా, హేమ తల్లిదండ్రులు తమ ఇంటికి రావద్దని రాజ్‌కుమార్ చెప్పేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వివాహం జరిగినప్పటి నుంచి దంపతుల మధ్య తరచూ వివాదాలు కొనసాగుతున్నాయని, తీవ్ర మనస్తాపానికి గురైన హేమ గత రెండు నెలలుగా తల్లిదండ్రుల వద్దే ఉంటోందని తెలిపారు. అనంతరం నెల రోజుల క్రితం పెద్దల సమక్షంలో రాజీ కుదిరిందని భావించి మళ్లీ భర్త వద్దకు పంపించామని, అయితే వేధింపులు కొనసాగడంతో ఆమె ఈ దారుణ నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు వాపోయారు. గురువారం సాయంత్రం అత్యవసర సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న మీర్‌పేట్ ఇన్‌స్పెక్టర్ శోభన్, పోలీసు సిబ్బంది మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
also read : విషాదం.. నాలుగు అంతస్తుల భవనం కూలి 9 మంది మృతి
