Homeతెలంగాణఆదిలోనే కవితకు షాక్.! పార్టీ పేరులో గంద‌ర‌గోళం

ఆదిలోనే కవితకు షాక్.! పార్టీ పేరులో గంద‌ర‌గోళం

 

  • ఈసీ ఉత్త‌ర్వులో మారిన పార్టీ పేరు

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో బలమైన ముద్ర చాటాలని భావిస్తున్నారు కల్వకుంట్ల కవిత. తనదంతా స్వతంత్ర భావజాలం అని.. తెలంగాణ వాదం అస్తిత్వం కోసం పోరాడుతానని చెప్పుకొచ్చారు ఆమె. భిన్నమైన రాజకీయాలకు వేదికగా నిలుస్తానని కూడా చెప్పారు. కానీ ఎందుకో ఆమె ప్రారంభంలోనే తడబడ్డారు. పార్టీ ఆవిర్భావ సభలో మాత్రం తెలంగాణ రాజకీయాలకు గట్టి సంకేతాలు పంపారు. కానీ పార్టీ పేరు విషయంలో మాత్రం వరుసగా ఆమె తప్పులు చేస్తున్నారు. అత్యంత కీలకమైన పార్టీ పేరులోనే ఇప్పుడు తేడా కొడుతోంది. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో ఆమె భారీ ఆవిష్కరణ చేశారు. కానీ కొద్ది రోజుల వ్యవధిలోనే రాష్ట్ర సేన బదులు.. తెలంగాణ రక్షణ సేన అని ఎలక్షన్ కమిషన్ ఆమోదించడం మాత్రం ఒక వైఫల్యంగానే భావించవచ్చు.

టెక్నికల్ అంశాలతో…

టిఆర్ఎస్ ను మళ్ళీ పునరుద్ధరిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించారు కల్వకుంట్ల కవిత. అయితే అంతా తెలంగాణ రాష్ట్ర సమితి అనుకున్నారు. కానీ టెక్నికల్ అంశాలు తెరపైకి రావడంతో అది వీలుపడలేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. తీరా ఎన్నికల సంఘం ఆమోదం పొందేసరికి తెలంగాణ రక్షణ సేనగా పేరు మార్పు అనేది ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. ఆదిలోనే తప్పటడుగులు పడినట్లు అయింది. అసలు తెలంగాణ రాష్ట్ర సేన సంగతి ఏంటి? అని వస్తున్న సందేహాలకు కవిత కూడా సమాధానం ఇవ్వడం లేదు. అసలు తెలంగాణ రాష్ట్ర సేన పేరు కోసం ఆమె దరఖాస్తు చేయలేదన్న ప్రచారం నడుస్తోంది. అసలు పార్టీ కోసం పంపిన 5 పేర్ల ప్రతిపాదనలో తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు లేదని స్వయంగా కవిత వెల్లడించడం విశేషం.

రాష్ట్రవ్యాప్తంగా నడిచిన హడావిడి…

రాష్ట్రవ్యాప్తంగా కవిత అనుచరులు తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో తెగ హడావిడి చేశారు. పార్టీ అజెండా, జండా ఆవిష్కరణ సమయంలోను రాష్ట్ర సేనగా పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అధికారిక ఉత్తర్వుల్లో మాత్రం రక్షణ సేన అని ఉండడం.. దానికి కనీసం వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు కవిత. వాస్తవానికి ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా ఖాతాలను రాష్ట్ర సేన పేరుతోనే ప్రారంభించారు. కానీ ఇప్పుడేమో రక్షణ సేన అని మార్చారు. దీని వెనుక పెద్ద కథ నడిచినట్లు స్పష్టమవుతోంది.

మళ్లీ టిఆర్ఎస్ను పునరుద్ధరించామన్న సంకేతాలను ప్రజల్లోకి పంపించడం కోసమే రాష్ట్ర సేనగా అప్పట్లో పేర్కొన్నారు. గులాబీ పార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతోనే వెనక్కి తగ్గారు. అందుకే చివరికి రక్షణ సేన పేరుతో సరిపెట్టుకున్నారు అనే అనుమానాలు ఉన్నాయి. అయితే మొన్నటి ఆవిర్భావ సభలో ప్రకటనకు.. ఇప్పుడు ఎన్నికల సంఘం ఉత్తర్వులకు అస్సలు సంబంధం లేదు. దీంతో ఒక రకమైన గందరగోళం కనిపిస్తోంది. పార్టీ ప్రారంభ సమయంలోనే ఈ తరహా వాతావరణం అంత సహేతుకం కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు