-పార్టీకి రెడ్డప్ప గారి దంపతులు గుడ్ బై
-వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికకు నిర్ణయం
-పొలిటికల్ వర్గాల్లో జోరుగా ప్రచారం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- ఏపీలో ఓ రాజకీయ సంచలనం నమోదు కానుందా? రాయలసీమలో కీలకమైన టిడిపి నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధం అయిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా దీనిపైనే ప్రచారం నడుస్తోంది. కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి, ఆమె భర్త, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలో వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా టాక్ నడుస్తోంది.
గత కొంతకాలంగా అసంతృప్తి…
గత కొంతకాలంగా రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవి రెడ్డి తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ ను తగ్గించారు. మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలుపు వెనుక ఈ దంపతుల పాత్ర ఉంది. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కడపలో మహానాడు నిర్వహించి రికార్డు సృష్టించారు. అయితే మహానాడులో హైలెట్ అయ్యారు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి. తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు కూడా. ఆయనను ఓదార్చే క్రమంలో చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్తు కల్పిస్తామన్నదే ఆ హామీ సారాంశం. అయితే మొన్న రాజ్యసభ పదవి పై ఆశలు పెట్టుకున్నారు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆ ఛాన్స్ దక్కలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పార్టీ దూతలు వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. అయితే మునుపటిలా రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనక పోవడంతో రకరకాల ప్రచారం మొదలైంది.
కొట్టిపారేస్తున్న కూటమి వర్గాలు..
తెలుగుదేశం పార్టీలో ఆది నుంచి ఉన్నారు రెడ్డప్ప గారి ఫ్యామిలీ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తున్న సమయంలో కూడా కడప జిల్లా కేంద్రంలో జండా పట్టారు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి అంటేనే సీనియర్లు విముఖత చూపుతున్న తరుణంలో నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు. బెదిరింపులకు వెనక్కి తగ్గలేదు. కేసులకు వెన్ను చూపలేదు. పైగా దూకుడు ప్రదర్శించి జిల్లాలో కూటమి ఏడు స్థానాలు గెలుపొందడంలో ఆయన కృషి ఉంది. పార్టీని నిలబెట్టారు అని చంద్రబాబు సైతం గుర్తించారు. అయితే రెడ్డప్ప గారి మాధవి రెడ్డికి మంత్రి పదవి ఆశించారు దక్కలేదు. రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి రాజ్యసభ పదవి ఆశించారు అది దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ దంపతులను వైసీపీలోకి రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే పార్టీతో పాటు పార్టీ అధినేత పై ఎంతో విధేయతతో ఉంటారు రెడ్డప్ప గారి కుటుంబ సభ్యులు. అందుకే ఆ దంపతులు పార్టీకి గుడ్ బై చెప్పే ఛాన్స్ లేదని.. పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదని కొట్టిపారేస్తున్నాయి టిడిపి కూటమి వర్గాలు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
