క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్-16 (పెద్ద గోల్కొండ) వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు (TS 23 F 2298) ఢీకొట్టింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా, హైదరాబాద్లోని సనత్నగర్ నివాసితులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఏడుగురు ఉండగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ కుటుంబం యాదగిరిగుట్ట దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
కారు అతివేగంతో ఉండటం మరియు డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం లేదా అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు భావిస్తున్నారు. కారు ఎంత వేగంగా ఢీకొట్టిందంటే, అది లారీ వెనుక భాగంలోకి పూర్తిగా చొచ్చుకుపోయింది.