Homeతెలంగాణతహసీల్దార్‌పై వరుస ఆరోపణలు..!

తహసీల్దార్‌పై వరుస ఆరోపణలు..!

– ఆకుతోటపల్లిలో 5 ఎకరాల భూమిపై అనుమానాలు
– వెంచర్‌ వివాదంలో రూ.5 లక్షల డీల్‌ అంటూ ప్రచారం
– గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు పక్క భూములపై బినామీల కన్ను..?
– సిబ్బంది ద్వారా వసూళ్ల ఆరోపణలు.. సమగ్ర విచారణ చేయలని ప్రజల డిమాండ్‌

క్రైమ్ మిర్రర్,రంగారెడ్డి:-
రంగారెడ్డి జిల్లా అమనగల్‌ తహసీల్దార్‌ కార్యాలయ పరిధిలో అధికారుల వ్యవహారశైలిపై వరుస ఆరోపణలు వెలువడుతున్నాయి. గతంలో అమనగల్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన ప్రస్తుత తహసీల్దార్‌పై అక్రమ ఆస్తులు కూడబెట్టారంటూ మండల ప్రజల్లో చర్చ జరుగుతోంది.
ఆకుతోటపల్లి రెవెన్యూ పరిధిలో సుమారు ఐదు ఎకరాల భూమిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేయించారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ భూమి లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు కోరుతున్నారు.
అదేవిధంగా అమనగల్‌ తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పెద్ద మొత్తంలో అవినీతి సొమ్మును కూడబెట్టారంటూ కొందరు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఓ వెంచర్‌ వివాదానికి సంబంధించి రూ.5 లక్షల మేరకు డీల్‌ కుదిరిందంటూ మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం జరుగుతోందని, దీనిపై అధికారులు విచారణ జరిపి వాస్తవాలను తేల్చాలని ప్రజలు కోరుతున్నారు.

గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు పక్క భూములపై కన్ను..?

గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు నిర్మాణంతో పరిసర ప్రాంతాల్లో భూముల విలువ పెరుగుతున్న నేపథ్యంలో రోడ్డు పక్కన ఉన్న భూములపై కొందరు దృష్టి సారించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్‌కు సంబంధించిన బినామీలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్మక్కై వివాదాస్పద భూములను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు మండల ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.వివాదాల్లో ఉన్న భూముల వివరాలను తెలుసుకుని, వాటిపై కన్నేసి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు పరిధిలోని భూముల రికార్డులు, లావాదేవీలను ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.

స్లాట్‌ల పేరుతో వసూళ్ల ఆరోపణలు

ఇక రెవెన్యూ కార్యాలయంలో స్లాట్‌ల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, సిబ్బంది ద్వారా నిత్యం డబ్బులు వసూలు చేస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజల నుంచి వివిధ పనుల పేరుతో డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తహసీల్దార్‌పై వస్తున్న భూ లావాదేవీలు, ఆస్తులు, వెంచర్‌ వివాదం, గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు పక్క భూములు, సిబ్బంది ద్వారా వసూళ్ల ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని మండల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు