Homeతెలంగాణసికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు బడ్జెట్‌కు ఆమోదం.. రూ.317.78 కోట్లతో అభివృద్ధి పనులు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు బడ్జెట్‌కు ఆమోదం.. రూ.317.78 కోట్లతో అభివృద్ధి పనులు

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ కార్యాలయంలో బుధవారం బోర్డు పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌తో పాటు రాబోయే కాలంలో చేపట్టబోయే పలు ప్రతిపాదనలకు పాలకమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్‌కు కేటాయించిన రక్షణ శాఖ స్థలానికి బదులుగా, కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన రూ.303 కోట్ల నిధుల వినియోగంపై బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిధులతో కంటోన్మెంట్ పరిధిలో జలమండలి, హెచ్‌ఎండీఏ సంయుక్తంగా చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణ, నాలాల విస్తరణ, అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు బోర్డు ఆమోదముద్ర వేసింది. కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ ఎస్ రాజీవ్ నేతృత్వంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రాబోయే రెండేళ్లకు సంబంధించిన ఆర్థిక ప్రణాళికలను ఆమోదించారు.

దీని ప్రకారం, 2026-27వ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.317,78,13,900లతో రూపొందించిన బడ్జెట్‌ను, అలాగే తదుపరి ఆర్థిక సంవత్సరం 2027-28కి సంబంధించి రూ.310,32,90,400ల అంచనాలతో సిద్ధం చేసిన బడ్జెట్ ప్రతిపాదనలను పాలకమండలి ఆమోదించింది. ప్రస్తుతం ఎస్క్రో ఖాతాలో భద్రంగా ఉన్న రూ.303 కోట్ల నిధులకు, అదనంగా రానున్న మరో రూ.13 కోట్లను జత చేసి.. మొత్తం రూ.316 కోట్లతో కంటోన్మెంట్ పరిధిలోని మొత్తం 8 వార్డుల్లో విస్తృతంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టడానికి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యూబోయిన్‌పల్లిలోని సర్వే నంబరు 157:1 పరిధిలో ఉన్న వివాదాస్పద 8 ఎకరాల ప్రభుత్వ స్థలం చుట్టూ రక్షణ ప్రహరీ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన అంశం ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ వ్యవహారాన్ని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ బోర్డు ముందు లేవనెత్తారు.

దీనిపై కంటోన్మెంట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అర్వింద్‌కుమార్ ద్వివేదీ స్పందిస్తూ.. సదరు స్థలంలో ప్రహరీ నిర్మాణానికి కంటోన్మెంట్ యంత్రాంగం సొంతంగా నిర్ణయం తీసుకోలేదని గౌరవ హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులకు కట్టుబడే ఈ అనుమతులను మంజూరు చేయాల్సి వచ్చిందని ప్రజాప్రతినిధులకు సవివరంగా వివరణ ఇచ్చారు. మడ్‌ఫోర్ట్ ప్రాంతంలో రహదారికి ఇరువైపులా చెత్త తరలించే మున్సిపల్ వాహనాలను నిలపడం వల్ల ప్రతిరోజూ తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజాప్రతినిధులు బోర్డు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన అధికారులు, ఆ వాహనాలను ప్రధాన రహదారిపై కాకుండా సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో నిలిపేలా తక్షణ చర్యలు చేపడుతున్నట్లు హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ పరిధిలోని పేదల ఇళ్లను, నివాసాలను తొలగిస్తున్నారంటూ వస్తున్న పుకార్లపై సీఈవో తీవ్రంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులైన పేదల ఇళ్లను తొలగించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేస్తూ ప్రజలకు భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు