Homeఅంతర్జాతీయంబీహార్ కు 'సామ్రాట్'

బీహార్ కు ‘సామ్రాట్’

  • కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి

  • నితీష్ కేంద్ర రాజకీయాల్లోకి

  • రాజ్యసభకు ప్రమోట్

  • బిజెపి అనూహ్య నిర్ణయం

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: బీహార్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం. ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బిజెపి నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన నితీష్ కుమార్ యుగం ముగిసినట్టే. ప్రస్తుత సీఎం గా ఉన్న నితీష్ కుమార్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆయన పేరును రాజ్యసభకు పరిశీలిస్తున్నట్లు ఆ మధ్యన ప్రచారం నడిచింది. అయితే స్వయంగా నితీష్ కుమార్ దానిని ధ్రువీకరించారు. రాజ్యసభ పదవి చేపట్టడం ద్వారా కేంద్ర క్యాబినెట్ లోకి వెళ్తానని పరోక్ష సంకేతాలు అందించారు నితీష్. అయితే నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బిజెపి హై కమాండ్ సామ్రాట్ చౌదరి పేరును సీఎంగా అధికారికంగా ప్రకటించనున్నట్లు రాజకీయ వర్గాల్లో బలమైన ప్రచారం నడుస్తోంది.

సుదీర్ఘ అనుబంధానికి తెర..
దాదాపు 20 సంవత్సరాలకు పైగా బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు నితీష్ కుమార్. తరచూ పార్టీలతో పాటు కూటములను మార్చుతూ తన ముఖ్యమంత్రి పదవిని పదిల పరుచుకుంటూ వచ్చారు. మొన్ననే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘనవిజయం సాధించడంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే నితీష్ పార్టీ కంటే ఇక్కడ బిజెపి ఎక్కువ స్థానాలు సాధించింది. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ పేరును ప్రకటించి ఎన్నికలకు వెళ్లడంతో ఆయనకు పదవి అప్పగించింది బిజెపి. అయితే పదే పదే ప్రభుత్వాలను మారుస్తూ పల్టీమార్ అనే ముద్ర వేసుకున్న నితీష్ ఈసారి అనూహ్యంగా రాష్ట్ర రాజకీయాలనుంచి తప్పుకుని జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేశారు. తన చిరకాల కోరికగా ఉన్న రాజ్యసభ సభ్యత్వాన్ని నెరవేర్చుకునేందుకు ఆయన ఇటీవల ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తద్వారా బీహార్లో అతిపెద్ద పార్టీగా ఉన్న బిజెపికి తమ సొంత నేతను సీఎంగా నియమించుకునే స్వేచ్ఛ కల్పించారు.

ఎట్టకేలకు బిజెపికి ఛాన్స్..
బీహార్లో అధికారంలోకి రావాలని సుదీర్ఘకాలం పోరాడుతూ వచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇన్నాళ్లకు మార్గం సుగమం అయింది. సామ్రాట్ చౌదరి ప్రస్తుతం బీహార్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. బలమైన ఓటు బ్యాంకు కలిగిన కుస్వాహ సామాజిక వర్గానికి చెందిన వారు. గత కొంతకాలంగా నితీష్ కుమార్ తన వారసుడిగా సామ్రాట్ చౌదరిని ప్రమోట్ చేస్తూ సంకేతాలు ఇచ్చారు. సామ్రాట్ చౌదరికి యువతలో మంచి పట్టు ఉంది. పార్టీకి అత్యంత విధేయుడు. అందుకే ఆయనను ముందు పెట్టి బీహార్లో బిజెపిని అభివృద్ధి చేయాలని భావిస్తోంది హై కమాండ్.

కోర్ కమిటీలో నిర్ణయం..
భారతీయ జనతా పార్టీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న కోర్ కమిటీ అభిప్రాయం ముఖ్యం. త్వరలో ఢిల్లీలో జరిగే బిజెపి కోర్ కమిటీ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై తుది నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి పదవి కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయి పేరు కూడా వినిపిస్తోంది. కానీ వివిధ సమీకరణలో భాగంగా సామ్రాట్ చౌదరి వైపే బీజేపీ హై కమాండ్ మొగ్గు చూపే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో??

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు