మంచిర్యాల , క్రైమ్ మిర్రర్: మంచిర్యాల జిల్లాలో నిన్న కురిసిన కాల వర్షాలు, ఈదురుగాలులుకు రెండు వేర్వేరు ఘటనల్లో గోడలు కూలి నలుగురు రైతులు దుర్మరణం చెందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన రైతుల కుటుంబాలకు వెంటనే రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, గాయపడ్డ రైతులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతుల ప్రాణాలు గాలిలో దీపాలా అని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశ్నించారు. వారాల తరబడి పండించిన పంట కొనకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మూడు రోజుల్లోనే వివిధ కొనుగోలు కేంద్రాల వద్ద ఏడుగురు రైతులు మరణించారని తెలిపారు. ఇవన్నీ రాష్ట్ర సర్కారు చేసిన హత్యలే అని ఆరోపించారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న అన్ని పంటలు రాష్ట్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం గంపలపల్లి ధాన్యంపై పరదాలు కప్పేందుకు వెళ్లి వర్ష ఎక్కువ కావడంతో పక్కన షెడ్ లోకి వెళ్లిన తనుగుల నాగరాజు, అభిరామ్ తండ్రీ కొడుకులపై గోడ కూలి మృతి చెందారు.
కొత్తూరు గ్రామంలో వరి ధాన్యం పై పరదాలు కప్పేందుకు వెళ్లిన రైతులు ఆరుగురు మీద గోడ కూలి పడింది. ఈ ఘటనలో గుండారపు వెంకటేష్ (కొత్తూరు) రైతు మృతి చెందారు. ముత్యం పేట గ్రామానికి చెందిన నెల్క లచ్చన్న అనే వ్యక్తి లక్షెట్టిపేటలో తన కొడుకును బస్ ఎక్కించి తిరిగి ఇంటికి వెళ్తూ వర్షం పడుతుంది అని కొత్తూరు లో రైతులు ఆగిన దగ్గర ఆగారు. ఈ క్రమంలో గోడ కులడంతో ఆయన సైతం మృతి చెందారు. ఘటనలో గాయ పడిన మరో నలుగురిని మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలించారు. బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పరామర్శించారు.