దేశవ్యాప్తంగా రైళ్లలో ప్రయాణించే మహిళలకు పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల ఆరోగ్యం, సౌకర్యాన్ని మెరుగుపరచే లక్ష్యంతో రైల్వే స్టేషన్లలో ఉచిత శానిటరీ నాప్కిన్ ప్యాడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ కార్యక్రమం అమలు కోసం రైల్వే శాఖ ప్రముఖ టెలికాం మౌలిక వసతుల సంస్థ ఇండస్ టవర్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వారి “నారీ సమ్మాన్” కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమం కింద ఈ సేవలు ప్రారంభించబడ్డాయి.
మొదటి దశలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో సుమారు 500 శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ, లక్నో సహా పలు డివిజన్లలోని 175 స్టేషన్లలో ఈ మెషీన్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఈ మెషీన్ల ద్వారా మహిళలు 24 గంటలపాటు ఉచితంగా శానిటరీ ప్యాడ్లను పొందవచ్చు.
ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 3 కోట్లకు పైగా నాప్కిన్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని స్టేషన్లకు ఈ సేవలను విస్తరించే యోచనలో రైల్వే శాఖ ఉంది. 2030 నాటికి దేశవ్యాప్తంగా విస్తృతంగా ఈ సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
ఈ నిర్ణయం మహిళల ఆరోగ్య భద్రతకు, ప్రయాణ సౌలభ్యానికి ఎంతో ఉపయోగపడనుందని భావిస్తున్నారు.
also read: ఘనంగా ‘రొట్టెల పండుగ’ ప్రారంభం… దేశం నలుమూలల నుంచి భక్తుల రద్దీ!