– అప్పుడే అధికారులు రిపోర్ట్ చేస్తున్నారట
– 200 మంది ఉన్నతాధికారులు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారంటూ కామెంట్స్
– తప్పు పడుతున్న రాజకీయ విశ్లేషకులు
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్:-
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వింత ప్రకటనలు చేస్తున్నారు. ప్రజల్లో మరింత పలుచన అవుతున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా వింతగా ఉన్నాయి. ప్రధాని మోడీకి దిమ్మ తిరిగిపోయే నిజాలు తమ వద్ద ఉన్నాయని.. కేంద్ర ప్రభుత్వంలోని సీబీఐ, ఈ డి తో పాటు విదేశాంగ శాఖకు చెందిన దాదాపు 200 మంది ఉన్నతాధికారులు కాంగ్రెస్ పార్టీతో నిరంతరం టచ్ లో ఉంటున్నారంటూ వ్యాఖ్యానించారు. బాహటంగానే ఈ వ్యాఖ్యానాలు చేశారు. రాజకీయాల్లో పరినీతి కలిగిన ఏ నేత కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయరు అన్నది బహిరంగ రహస్యం. దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీలను కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు దుర్వినియోగం చేస్తోందని.. అధికారులు బిజెపి కనుసన్నల్లో నడుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా గగ్గోలు పెడుతోంది. ఇప్పుడు అదే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ దర్యాప్తు సంస్థల అధికారులు తమకు టచ్ లో ఉన్నారని చెప్పడం దేనికి సంకేతం?
ఎలా సమర్ధన?
ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే అధికార యంత్రాంగం బీజేపీ మాట వింటే రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ గగ్గోలు పెట్టింది. ఇప్పుడు అదే బ్యూరోక్రాట్లు నిబంధనలకు విరుద్ధంగా విపక్ష నేతలకు ప్రభుత్వ అంతర్గత సమాచారాన్ని లీక్ చేస్తుంటే వారు నిజాయితీపరులు.. గొప్ప దేశభక్తులు అయిపోతారా అనే ప్రశ్న వస్తుంది. అధికారిక సర్వీసు రూల్స్ ను ఉల్లంఘిస్తూ ఒక రాజకీయ పార్టీతో చేతులు కలిపి.. సమాచార చౌర్యానికి పాల్పడే అధికారులను సమర్ధించడం ద్వారా రాహుల్ గాంధీ వ్యవస్థలను మరింత భ్రష్టు పట్టిస్తున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులే తమతో టచ్ లో ఉన్నారని గొప్పలు చెప్పుకోవడం ద్వారా ప్రభుత్వానికి కాకపోయినా.. కనీసం సర్వీసు నిబంధనల ప్రకారం నడుచుకునే అధికారులనైనా ఆయన అనుమానాల బోనులో పెట్టారు.
స్థాయి తగ్గించుకొని
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి. అందులో మరో మాటకు చావు లేదు. కానీ ఆయన మాటలు కోటలు దాటుతున్నాయి. చేస్తున్న వ్యాఖ్యలు నవ్వుల పాలు చేస్తున్నాయి. ఎంతమంది అధికారులు టచ్ లో ఉన్నారని చెప్పుకున్నా.. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోలేనప్పుడు ఇలాంటి ప్రకటనల వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రత్యేక ప్రయోజనం లేదు. గత ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో తిరస్కరణకు గురైన ప్రతిసారి సంస్థలు కుప్పకూలిపోయాయి అంటూ నెపం వెయ్యడం.. తీరా ఎన్నికల ముగిసాక అదే సంస్థల అధికారులు తమ వెనుకే ఉన్నారని చెప్పుకోవడం రాహుల్ రాజకీయ అమాయకత్వానికి సాక్ష్యంగా కనిపిస్తోంది. చేసే ప్రకటనల విషయంలో రాహుల్ ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసుకుంటే మంచిది. లేకుంటే మాత్రం ప్రజల్లో మరింత అనుమానాలు పెంచడమే కాకుండా పలుచన కావడం ఖాయం.
