– మూడు రోజుల్లోనే 1.40 కోట్ల మంది ప్రయాణాలు
– మరో మూడు రోజులపాటు ప్రత్యేక బస్సులు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:- తెలంగాణలో దసరా సందడి నెలకొంది. బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. కేవలం మూడు రోజుల్లోనే 1.40 కోట్ల మంది ప్రయాణాలు చేశారు. మరో మూడు రోజులపాటు పండగ స్పెషల్ బస్సులను నడపనున్నారు. అయితే ఒక్కసారిగా పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను పెంచింది. బస్సుల నిర్వహణపై దృష్టి పెట్టింది. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా లభిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యం పండుగ సమయంలోనూ కొనసాగుతోంది. అయితే ఏ బస్సు చూసిన జనాలతో కిటకిటలాడుతూ కనిపించడం విశేషం. పండుగ ప్రయాణాలకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోందని ఆర్టీసీ వెల్లడించింది. ఎప్పటికప్పుడు ఈజీఎస్ ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
* స్వస్థలాలకు వలస జీవులు..
దసరా తో పాటు బతుకమ్మ పండుగ కావడంతో భాగ్యనగరం నుంచి ప్రజలు స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో అన్ని రకాల బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ ఆర్టీసీ అదనపు బస్సుల సంఖ్యను పెంచింది. గత ఏడాది పండుగ సమయంలో తొలి మూడు రోజుల్లో 922 అదనపు బస్సులు నడిపారు. అయితే ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే 495 బస్సులను అదనంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 1417 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం విశేషం. పండుగకు ముందు సంతులకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో పాటు తిరుగు ప్రయాణ సమయంలోను రద్దీ ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రాకపోకలను గమనిస్తూ బస్సుల నిర్వహణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
* ఉచిత ప్రయాణ పథకంతో..
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పండుగ సమయంలో మహిళల ఉచిత ప్రయాణానికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతోంది. ఈ పథకం ద్వారా దసరా రద్దీ సమయంలో రోజుకు సగటున రూ.13.73 కోట్ల మేర ఆదా చేసుకున్నట్లు టిజిఎస్ ఆర్టీసీ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో రోజువారి సగటు ఆదా రూ.13.2 కోట్లుగా నమోదయింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో పెరగడం గమనించదగ్గ విషయం. పండగ తిరుగు ప్రయాణ సమయంలో సైతం ఈ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్లకు సైతం అవకాశం ఇచ్చింది. ఇందుకుగాను ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది.
