HomeజాతీయంControversial Posters: వయనాడ్ మరో అమేథీ అవుతుంది.. రాహుల్, ప్రియాంకకు వార్నింగ్!

Controversial Posters: వయనాడ్ మరో అమేథీ అవుతుంది.. రాహుల్, ప్రియాంకకు వార్నింగ్!

కేరళలో వెలిసిన కొన్ని పోస్టర్లు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను లక్ష్యంగా చేసుకుని వయనాడ్‌ లో ఈ పోస్టర్లు కనిపించడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ముఖ్యంగా కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎంపికపై ఉత్కంఠ కొనసాగిన సమయంలో ఈ పోస్టర్లు వెలుగులోకి రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

రాహుల్ గాంధీకి హెచ్చరికలు

ఈ నెల 13న వయనాడ్‌ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. ఆ సమయంలో సీఎం రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ పేరు బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను సీఎం చేస్తే తీవ్ర రాజకీయ పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ పోస్టర్లలో సందేశాలు కనిపించాయి. ఒక పోస్టర్‌ లో “మిస్టర్ రాహుల్… కేసీ వేణుగోపాల్ మీకు దగ్గరి వ్యక్తి కావచ్చు. కానీ, కేరళ ప్రజలు అలాంటి నిర్ణయాన్ని ఎప్పటికీ క్షమించరు” అని రాసి ఉంది. మరో పోస్టర్‌లో “కేసీ వేణుగోపాల్‌ను ఎంపిక చేస్తే వయనాడ్ మీకు మరో అమేథీ అవుతుంది” అని రాశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయిన విషయాన్ని ఇందులో పరోక్షంగా ప్రస్తావించారు.

ప్రియాంకపైనా ఆగ్రహం

అలాగే “వయనాడ్‌ను రాహుల్, ప్రియాంక మరిచిపోవచ్చు.. కానీ ఇక్కడి ప్రజలు మిమ్మల్ని మళ్లీ గెలిపించరు” అనే హెచ్చరికలతో కూడిన పోస్టర్లు కూడా కనిపించాయి. ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోస్టర్లు అతికించిన వ్యక్తి అరెస్ట్

ఈ ఘటనపై స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. సిద్ధిఖ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఒక వ్యక్తి పోస్టర్లు అతికించినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.

ఇవాళ కేరళ సీఎంగా సతీషన్ ప్రమాణం

ఇక కేరళ సీఎం ఎంపికపై మే 4 నుంచి కొనసాగిన ఉత్కంఠకు మే 14న తెరపడింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో యూడీఎఫ్ 102 సీట్లు గెలుచుకోగా, సీఎం రేసులో కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్, రమేష్ చెన్నితాల పేర్లు వినిపించాయి. చివరకు కాంగ్రెస్ అధిష్టానం వీడీ సతీశన్‌ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఇవాళ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు