HomeతెలంగాణVidya Varotsavalu: విద్యార్థులు లేరు, సిబ్బంది గైర్హాజరు.. విద్యా వారోత్సవాలు పేరుకేనా!?

Vidya Varotsavalu: విద్యార్థులు లేరు, సిబ్బంది గైర్హాజరు.. విద్యా వారోత్సవాలు పేరుకేనా!?

*విద్యా వారోత్సవాలకు స్పందన కరువు

 *కళాశాలల్లో ప్రిన్సిపల్స్, సిబ్బంది డుమ్మా

*అర్జిత సెలవుల కోసం మరికొంత మంది హాజరు!

*FRS హాజరుతో బయటపడుతున్న వాస్తవాలు

*హాజరు కాని అధ్యాపకులపై చర్యలేమిటి?

క్రైమ్ మిర్రర్, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో  విద్యా వారోత్సవాలు నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ సూచించింది. ఈ కార్యక్రమాల కోసం వారంరోజుల షెడ్యూల్‌ను కూడా కమిషనర్ కార్యాలయం విడుదల చేసింది. ప్రతిరోజూ ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కళాశాలలకు ఆదేశాలు వెళ్లాయి. అలాగే ఈ వారోత్సవాల్లో పాల్గొనే అధ్యాపకులు, సిబ్బంది ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ద్వారా తప్పనిసరిగా హాజరు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

విద్యా వారోత్సవాలకు ప్రిన్సిపాల్స్, అధ్యాపకుల డుమ్మా

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా చాలా కళాశాలల్లో పరిస్థితి భిన్నంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ పలువురు ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది కళాశాలలకు హాజరు కావడం లేదని సమాచారం. కళాశాలల వారీగా FRS హాజరు వివరాలను పరిశీలిస్తే, అసలు విషయాలు బయటపడుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే సిబ్బందికి అర్జిత సెలవులు (ELs) మంజూరు చేస్తారని సమాచారం ఉన్నప్పటికీ, కొంతమంది మాత్రం వాటిపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కొంతమంది “మాకు సెలవులు అవసరం లేదు” అంటూ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని కళాశాల వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హాజరుకాని నాన్ టీచింగ్ స్టాఫ్

ఇక ఈ విద్యా వారోత్సవాల్లో కేవలం అధ్యాపకులే కాకుండా, అధ్యాపకేతర సిబ్బంది కూడా తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, అనేక కళాశాలల్లో నాన్ టీచింగ్ సిబ్బంది హాజరు కావడం లేదని సమాచారం. కొన్నిచోట్ల మాత్రం కొద్దిమంది సిబ్బంది మాత్రమే కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

మరోవైపు, వేసవి సెలవులు ప్రకటించడంతో చాలా కళాశాలల్లో విద్యార్థుల హాజరు లేకపోవడం కూడా ఈ కార్యక్రమాలపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ హాస్టళ్లు కూడా మూసివేయడంతో విద్యార్థులు కళాశాలలకు రావడం లేదు. దీంతో విద్యా వారోత్సవాలు విద్యార్థుల భాగస్వామ్యం లేకుండానే కేవలం సిబ్బంది స్థాయిలోనే కొనసాగుతున్నాయని చెబుతున్నారు.

ప్రభుత్వం చర్యలు తీసుకునేనా?  

కొన్ని కళాశాలల్లో ఆసక్తి ఉన్న అధ్యాపకులు మాత్రమే కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, మిగతావారు గైర్హాజరవుతున్నారని సమాచారం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న ఈ విద్యా వారోత్సవాల్లో సిబ్బంది నిర్లక్ష్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా గైర్హాజరైన వారిపై ఉన్నత విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  హాజరు వివరాలను సేకరించి పరిశీలిస్తుందా? లేక పట్టనట్లు వ్యవహరిస్తుందా? అన్నది చూడాలి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు