మళ్లీ వ్యూహకర్తగా..
గులాబీ పార్టీకి పూర్తిస్థాయిలో సేవలు
కవిత కొత్త పార్టీకి సలహాలు
రేవంత్ ను గద్దె దించడమే టార్గెట్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించనున్నారా? రేవంత్ ను టార్గెట్ చేయనున్నారా? గులాబీ పార్టీకి స్ట్రాటజీ సేవలను అందించనున్నారా? అదే సమయంలో కవితకు సైతం విలువైన సలహాలు ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ కేవలం రేవంత్ ను అధికారం దూరం చేసేందుకే వచ్చే ఎన్నికల్లో పని చేస్తారు అని స్పష్టమవుతోంది.
రేవంత్ పై ఆగ్రహం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటేనే మండి పడిపోతున్నారు ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ ను ఉద్దేశించి చాలా రకాల వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. అప్పట్లో గులాబీ పార్టీకి సేవలు అందించారు ప్రశాంత్ కిషోర్. గులాబీ పార్టీని విమర్శించే క్రమంలో రేవంత్ రెడ్డి బిహారి డిఎన్ఏ అంటూ ప్రశాంత్ కిషోర్ పై తీవ్ర స్థాయిలో మండిపడేవారు. దానిని మనసులో పెట్టుకున్నారు ప్రశాంత్ కిషోర్. అందుకే వచ్చే ఎన్నికల్లో నేనే స్వయంగా వచ్చి రేవంత్ రెడ్డిని ఓడిస్తాను అంటూ బహిరంగంగానే సవాల్ విసిరారు. అందుకే ఇప్పుడు గులాబీ పార్టీతో పాటు కల్వకుంట్ల కవితకు సైతం సేవలందించేందుకు పీకే సిద్ధపడ్డారట. ఎట్టి పరిస్థితుల్లో గులాబీ పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతారట. రేవంత్ పై ఈ స్థాయిలో ఆగ్రహంతో ఉన్న పీకే సేవలను కెసిఆర్ సక్రమంగా వినియోగించుకునే పనిలో ఉన్నారట. అయితే ఒకవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించేందుకు సిద్ధపడుతున్నారు పీకే. కానీ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిలవాలని చూస్తున్నారు.
కవిత కొత్త పార్టీకి..
తెలంగాణలో సరికొత్త రాజకీయ ప్రయాణం ప్రారంభించనున్నారు కవిత. ఈ నెల 25న మేడ్చల్ వేదికగా కొత్త పార్టీని ప్రకటించనున్నారు. అయితే ఈ పార్టీ విధివిధానాల స్ట్రాటజీల వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారు అనేది ఒక అనుమానం. ప్రాంతీయ అస్తిత్వాన్ని నొక్కి చెబుతూ.. 50 కమిటీలతో ఒక పక్కా ప్లాన్ ను పీకే సిద్ధం చేస్తున్నారని సమాచారం. అదే సమయంలో గులాబీ పార్టీకి సైతం ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఆ పార్టీ క్యాడర్లో జీవాలు నింపేందుకు ఒక రహస్య సర్వేను కూడా పూర్తి చేసినట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక ప్రచారం ఉంది. వచ్చే ఆరు నెలల్లో కేసీఆర్ యాక్షన్ ప్లాన్ దిశగా అడుగులు వేస్తున్నారు. దాని వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. అయితే పొలిటికల్ స్ట్రాటజీని విడిచిపెట్టి.. సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు ప్రశాంత్ కిషోర్. అది వర్కౌట్ కాకపోతే సరికి తిరిగి రాజకీయ వ్యూహకర్తగా మారాలని భావిస్తున్నారు. తెలంగాణలో 2028లో తన ప్రభావం చూపి జాతీయస్థాయిలో బిజీ కావాలన్నది పీకే ఆలోచన. చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతారో..