*ఇసుక దందాలో బిఆర్ఎస్ ముఖ్యుల బినామీలు
*ఈడి దర్యాప్తులో నమ్మలేని నిజాలు
*అప్పట్లో ఇచ్చి పుచ్చుకున్న వైసిపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :- ఏపీలో ఇసుక కుంభకోణం హాట్ టాపిక్ అయ్యింది. ఇది కేవలం ఏపీకి మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణలో కూడా దీని మూలాలు కనిపిస్తున్నాయి. ఏపీ ఇసుక స్కాంలో బిఆర్ఎస్ పెద్దల ఆప్తులు కూడా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ఈ భారీ దందాలో గులాబీ పార్టీ అగ్రనేతల బినామీలకు కూడా వాటాలు దక్కాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈడి దాడులతో బలపడుతోంది ఈ అనుమానం. అప్పట్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు గా ఉన్న కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ అవగాహనతో ముందుకు సాగారు. అప్పట్లోనే ఏపీలో జరిగిన ఇసుక దందాలో గులాబీ పార్టీ నేతలకు సైతం భాగం ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఏకకాలంలో సోదాలు..
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలపై దృష్టి పెట్టింది కూటమి. అదే సమయంలో ఈడీ సైతం రంగంలోకి దిగింది. ఈ కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్, జైపూర్,, కోయంబత్తూర్ నగరాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. గులాబీ పార్టీ అగ్రనేతలకు అత్యంత సన్నిహితులుగా పేరున్న ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు చెందిన బోయినపల్లి శ్రీనివాసరావు నివాసాలు, ఫామ్ హౌస్ లు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టింది. ఈ ఇసుక దందాలో అప్పట్లో అంతర్రాష్ట్ర నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించింది.
భారీ ఎత్తున నగదు స్వాధీనం..
ఈడి తనిఖీల్లో భారీగా నగదు, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.1.53 కోట్ల నగదు, 1800 యూఎస్ డాలర్లు, రూ.1.29 కోట్ల విలువైన వెండి కడ్డీలు లభ్యమయ్యాయి. వీటితోపాటు కీలకమైన డిజిటల్ డివైస్ లు, బినామీ ఆస్తులకు సంబంధించిన భూమి పత్రాలను అధికారులు సీజ్ చేశారు. అప్పట్లో అనుమతించిన పరిమితికి మించి, నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వడం ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును ఈ సంస్థల ద్వారా మళ్లించినట్లు ఈడీ ప్రాథమిక ఆధారాలు సేకరించింది.
ఆ మూడు ప్రధాన సంస్థలు కీలకం
ఏపీలో ఇసుక తవ్వకాలకు సంబంధించిన అక్రమాల్లో మూడు ప్రధాన సంస్థలు కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీసికేసి ప్రాజెక్ట్, తరుణ్ కి ఎంటర్ప్రైజెస్ కలిసి భారీ అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. అనుమతి పొందిన లోతు కంటే ఎక్కువగా తవ్వకాలు జరపడం, నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఈ సంస్థలను గతంలోనే రూ.2407 కోట్ల మేర డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిపి.. తమకు అనుకూలమైన వారికే కాంట్రాక్టులు కట్టబెట్టడంలో అప్పట్లో ఏపీ ప్రభుత్వ పెద్దలు సహకరించారు. గులాబీ పార్టీ ముఖ్య నేతల బినామీలుగా ఉన్నవారికి ఇసుక గనులు కేటాయించారు. అయితే ఈ కేసులో వెంకటరెడ్డి తో పాటు బోయినపల్లి శ్రీనివాస్ రెడ్డి వంటి వారి పేర్లు బయటకు రావడం రాజకీయంగా పెను దుమారానికి దారితీస్తోంది.