-
మాదాపూర్ ధృవ కాలేజ్ సమీపంలో దారుణ హత్య
-
యువకుడిని కర్రలతో కొట్టి చంపిన ఇద్దరు
క్రైమ్ మిర్రర్, మాదాపూర్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధృవ కాలేజ్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇమేజ్ గార్డెన్ రోడ్ ఎదురుగా ఉన్న శ్రీ శ్రీ సూట్స్ (నోమా) హోటల్ వద్ద జరిగిన దాడిలో హోటల్ ఉద్యోగి సెనేపల్లి భాస్కర్ (32) మృతి చెందాడు.
పోలీసుల వివరాల ప్రకారం, జూలై 14వ తేదీ రాత్రి సుమారు 11:47 గంటలకు హోటల్ సమీపంలో గొడవ జరుగుతోందంటూ డయల్-100కు సమాచారం అందింది. వెంటనే మాదాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన భాస్కర్‌ను చికిత్స నిమిత్తం కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు జూలై 15వ తేదీ ఉదయం 1:05 గంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే ఆయన మృతి చెందినట్లు (Brought Dead) నిర్ధారించారు.
ప్రాథమిక విచారణలో, మృతుడు గత కొంతకాలంగా నిందితుడు రాజు కుమార్తెను వేధిస్తున్నాడనే అనుమానంతో రాజు కక్ష పెంచుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాజు తన బావ కుమారస్వామితో కలిసి కర్రలతో భాస్కర్‌పై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
మృతుడు సెనేపల్లి భాస్కర్ మాదాపూర్‌లోని శ్రీ శ్రీ సూట్స్ (నోమా) హోటల్‌లో ఉద్యోగిగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. అతని స్వస్థలం వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం, ఉప్పర్‌పల్లి గ్రామం. నిందితులు రాజు, కుమారస్వామి కూడా వరంగల్ జిల్లా హనుమకొండ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు దారితీసిన పూర్తి పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది.