ఉత్తరప్రదేశ్, క్రైమ్ మిర్రర్: వేతనాలు పెంపు, 8గంటల పని కోసం నిన్న(సోమవారం) కార్మికులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ సందర్భంగా నోయిడాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడిన 300 మంది కార్మికులను అరెస్టు చేశారు. మరో వంద మందిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.. నోయిడాలోని ఫేజ్-2, సెక్టార్ 60, సెక్టార్ 62, సెక్టార్ 84 సహా పలు ప్రాంతాల్లో కార్మికులు ఆందోళనకు దిగారు.
పలు వాహనాలను తగులపెట్టి.. భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారు. జాతీయ రహదారి -9 సహా పలు రోడ్లను దిగ్బంధించారు. దీంతో నోయిడా- ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తెంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువులు సైతం ప్రయోగించారు. దీంతో రాష్ట్రంలో అల్లకల్లోలంగా మారింది.
పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయేమో…
హింసాత్మక సంఘటనల సందర్భంగా ఉత్తర ప్రదేశ్ కార్మికశాఖ మంత్రి అనిల్ రాజ్‌భర్ స్పందించారు. ఈ దాడికి ముందస్తు ప్రణాళిక ప్రకారమే చేశారని ఆరోపించారు. పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఇటీవల నోయిడా, మీరట్‌లలో నలుగురు అనుమానితులు అరెస్టయిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.నిన్నటి దాడికి పాకిస్థాన్‌తో సంబంధం ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఆ కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలో అస్థిరతను సృష్టించేందుకు దేశ వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. ముజఫర్‌నగర్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యక్రమానికి అంతరాయం కలిగించే కుట్రలో భాగంగానే ఈ అల్లర్లు జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
