Homeజాతీయంపెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. యువకుడి రెండు చేతులు నరికేసిన దుండగులు

పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. యువకుడి రెండు చేతులు నరికేసిన దుండగులు

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెట్రోల్ బంక్ వద్ద జరిగిన చిన్నపాటి గొడవ క్షణాల్లోనే రక్తపాతానికి దారితీసింది. కొందరు దుండగులు ఓ యువకుడిపై గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి, అతని రెండు చేతులను మణికట్టు వరకు నరికివేశారు. ఈ దాడిలో తలకు, కాళ్లకు కూడా తీవ్ర గాయాలు కావడంతో బాధితుడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందేల్ ప్రాంతానికి చెందిన జైవేంద్ర సింగ్ మంగళవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో కాన్పూర్–సాగర్ జాతీయ రహదారిపై ఉన్న ఓ పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు. వాహనానికి ఇంధనం నింపించుకుంటున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులతో అతడికి వాగ్వాదం జరిగింది. మొదట మాటామాటా పెరిగిన ఈ వివాదం క్రమంగా ఘర్షణగా మారింది.

ఈ క్రమంలో ప్రత్యర్థులు ఒక్కసారిగా గొడ్డళ్లతో జైవేంద్రపై దాడికి దిగారు. అత్యంత దారుణంగా అతని రెండు చేతులను మణికట్టు వరకు నరికివేయడంతో పాటు తల, కాళ్లపై కూడా తీవ్రంగా దాడి చేశారు. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన జైవేంద్రను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మరో ప్రత్యేక ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితుడి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.

ఈ దాడి వెనుక స్థానిక రాజకీయ నాయకుడి హస్తం ఉందని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై కూడా అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నడిరోడ్డుపై జరిగిన ఈ అత్యంత దారుణ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
also read : నిద్రలోనే యువకుడిని కడతేర్చిన దుండగులు.. సూర్యాపేటలో కలకలం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు