మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): చింతపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని మర్రిగూడ మండలంలో అంగన్వాడీ టీచర్ 5 , ఆయా 4 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో, టీచర్ పోస్ట్ కోసం 67 మంది, ఆయా పోస్ట్ ల కోసం 24 మంది చొప్పున, మొత్తం 91 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫై ప్రక్రియను అధికారులు చేస్తున్నారు. వెరిఫికేషన్, నియామక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, యరుగండ్లపల్లి గ్రామ సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ అధికారులను కోరారు.
Also Read:ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు.. మంత్రి సీతక్క ప్రకటన!
రాజకీయ నాయకుల సిఫార్సులు, వ్యక్తిగత ఒత్తిళ్లు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా, అర్హత, మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకొని ఉద్యోగాల కోసం, ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వారికి, అంగన్వాడీ ఉద్యోగాలు ఒక మంచి అవకాశమని అన్నారు. అలాంటి అవకాశాలను రాజకీయ పలుకుబడి ఉన్న వారికో, సిఫార్సులతో వచ్చే వారికో కట్టబెట్టడం వల్ల నిజమైన అర్హులకు, తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల ప్రాథమిక విద్య, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని, అందువల్ల బాధ్యతాయుతమైన ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన, సేవాభావం ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేయాలని అన్నారు. అర్హతలను పక్కనపెట్టి నియామకాలు చేపడితే ప్రభుత్వ లక్ష్యాలు దెబ్బతినడంతో పాటు, చిన్నారుల భవిష్యత్తుపైన ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read:గ్యారంటీ లేకుండా రూ. 20 లక్షల వరకు రుణం.. ప్రధానమంత్రి ముద్రా యోజన!
నియామక ప్రక్రియలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని, ప్రతి దరఖాస్తును సమాన దృష్టితో పరిశీలించి మెరిట్ జాబితా ఆధారంగా, ఎంపికలు చేపట్టాలని అధికారులను వల్లంల కోరారు. ఎంపికల ప్రక్రియపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పూర్తి పారదర్శకత పాటిస్తే ప్రజల్లో ప్రభుత్వంపై, విశ్వాసం మరింత పెరుగుతుందని తెలిపారు. చదువుకొని ఉపాధి కోసం ఎదురుచూస్తున్న నిజమైన, అర్హుల ఆశలను వమ్ము చేయకుండా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అధికార యంత్రాంగం ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, సిఫార్సులు, ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, యరుగండ్లపల్లి సర్పంచ్ వల్లంల సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు.