క్రైం మిర్రర్ : పుణెలో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్ కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అధికారులు చర్యలు చేపట్టారు. పుణె మార్కెట్ యార్డ్‌లో ఉన్న మసాలా, డ్రై ఫ్రూట్స్ దుకాణంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు తెలిపారు.
అధికారుల తనిఖీల్లో దుకాణ నిర్వహణలో పలు లోపాలు బయటపడినట్లు సమాచారం. దీంతో వెంటనే విక్రయాలను నిలిపివేయాలని ఆదేశిస్తూ వ్యాపార నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా కల్తీ అనుమానాల నేపథ్యంలో దుకాణంలోని వివిధ ఆహార పదార్థాల నమూనాలను అధికారులు సేకరించారు.
తనిఖీల సమయంలో సుమారు రూ.8.14 లక్షల విలువైన 4,172 కిలోల సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దుకాణానికి సంబంధించిన అనుమతులు, లైసెన్సులపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం జరుగుతోందా లేదా అనే అంశంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు కూడా కొనసాగుతోంది. జూన్ 18న లోహగఢ్ కోట సమీపంలో కేతన్‌ను లోయలోకి తోసి హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో సియా గోయల్‌తో పాటు ఆమె ప్రియుడు చేతన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. కేతన్‌తో వివాహం ఇష్టం లేకపోవడం, వ్యక్తిగత సంబంధాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. కేతన్‌తో నిశ్చితార్థం జరిగిన తర్వాత సియా, చేతన్‌లు రాజస్థాన్‌లోని ఓ ఆలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నారనే సమాచారంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేసులో అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్న పోలీసులు, మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. మరోవైపు సియా కుటుంబ వ్యాపార సంస్థపై ఎఫ్‌డీఏ చర్యలు చేపట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
also read : పూరీ జగన్నాథ రథయాత్రలో విషాదం.. తొక్కిసలాటలో భక్తుడి మృతి