బెంగళూరులో ఓ లా విద్యార్థిని దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. తన సోదరుడిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే ఆగ్రహంతో ఓ వ్యక్తి యువతిపై కత్తితో దాడి చేయగా, చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించగా, నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత అనే న్యాయ విద్యార్థిని గతంలో ధనుష్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ, ధనుష్‌కు ఇప్పటికే పెళ్లి జరిగి భార్యతో విడాకులు తీసుకున్న విషయం అమృతకు తర్వాత తెలిసింది. దీంతో అతడిని ప్రశ్నించిన అమృత, ఆ సంబంధాన్ని కొనసాగించకుండా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
ఈ విషయం తెలుసుకున్న ధనుష్ సోదరుడు కోడిహళ్లి ప్రాంతంలో అమృతను కలిసి, తన సోదరుడినే వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, ఆగ్రహానికి గురైన అతడు వెంట తీసుకొచ్చిన కత్తితో అమృతపై విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
తీవ్రంగా గాయపడిన అమృతను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె పరిస్థితి విషమించడంతో చివరకు మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. హత్యకు దారితీసిన పూర్తి పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది.
also read : పసికందుపై కర్కశత్వం.. బ్లేడ్‌తో గాయపరిచి, ముళ్లపొదల్లో పడేసిన దుండగులు