క్రైం మిర్రర్ : ఒడిశాలోని ప్రపంచ ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో గ్రాండ్ రోడ్డులో ఒక్కసారిగా తీవ్ర రద్దీ ఏర్పడి తొక్కిసలాటను తలపించే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు వంద మందికి పైగా భక్తులు అస్వస్థతకు గురికావడంతో వారిని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనతో రథయాత్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గ్రాండ్ రోడ్డులో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో ఓ వ్యక్తికి ఊపిరాడక స్పృహ తప్పి కింద పడిపోయాడు. వెంటనే అత్యవసర సిబ్బంది స్పందించి అతడిని పూరీ జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ మరణంపై అధికారికంగా సంబంధిత అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
ఇదే ఘటనలో పలువురు భక్తులు రద్దీ కారణంగా గాయపడగా, మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 120 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
ఘటన అనంతరం పోలీసులు, సహాయక బృందాలు వెంటనే అప్రమత్తమై రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అదనపు భద్రతా చర్యలు చేపట్టినట్లు సమాచారం.
కాగా, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ రథయాత్ర గురువారం లక్షలాది మంది భక్తుల నడుమ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు పూరీకి చేరుకున్నారు.
also read : చిచ్చురేపిన ‘హోంవర్క్’ వివాదం…!