వానాకాలంలో ఉదయాన్నే టిఫిన్ తయారు చేయడం చాలా మందికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా దోశలు, ఇడ్లీలు వంటి వంటకాల కోసం ముందురోజే పిండిని సిద్ధం చేయాల్సి రావడం వల్ల అదనపు శ్రమ పడుతుంది. అలాంటి సమయంలో తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతోనే రుచికరమైన మరియు పోషక విలువలు అధికంగా ఉండే అల్పాహారం తయారు చేసుకోవచ్చు. ఓట్స్, కోడిగుడ్లు, ఉల్లిపాయ, టమాటా కలయికతో తయారయ్యే ఈ ప్రత్యేక వంటకం రుచితో పాటు శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఉదయం ఈ అల్పాహారం తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది.
ఈ వంటకాన్ని తయారు చేయడానికి 1 కప్పు ఓట్స్, 3 కోడిగుడ్లు, 1 పెద్ద ఉల్లిపాయ, 1 పెద్ద టమాటా, 4 పచ్చిమిర్చిలు, కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి అవసరం. ఈ పదార్థాలన్నీ అందుబాటులో ఉంటే కేవలం కొద్ది నిమిషాల్లోనే రుచికరమైన అల్పాహారం సిద్ధమవుతుంది.
తయారీ ప్రక్రియలో భాగంగా ముందుగా ఓట్స్‌ను శుభ్రంగా తీసుకుని మిక్సీలో వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి. అనంతరం ఒక గిన్నెలో రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి కలపాలి. తర్వాత 2 కోడిగుడ్లను పగలగొట్టి ఆ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఓట్స్ పొడి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి సమంగా కలిసేలా బాగా మిశ్రమం తయారు చేసుకోవాలి. చివరగా మిరియాల పొడి జత చేసి మరోసారి కలపాలి.
ఇప్పుడు పొయ్యిపై పాన్ పెట్టి బాగా వేడయ్యాక కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసుకోవాలి. అనంతరం సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని ఆమ్లెట్ మాదిరిగా పాన్‌పై సమంగా పరచాలి. మధ్యస్థ మంటపై సుమారు 3 నిమిషాలు మూతపెట్టి కాల్చాలి. ఒక వైపు బంగారు రంగులో కాలిన తర్వాత జాగ్రత్తగా తిప్పి మరో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. రెండు వైపులా సమంగా ఉడికిన తర్వాత దింపేసి వేడివేడిగా వడ్డించుకోవాలి. రుచికరమైన ఈ ఓట్స్ ఆమ్లెట్‌ను టమాటా పచ్చడి లేదా కారపు చట్నీతో తింటే మరింత రుచిగా ఉంటుంది. తక్కువ సమయంలో సిద్ధమయ్యే ఈ వంటకం ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ఉదయపు అల్పాహారానికి అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది.
ALSO READ: రెండు యూఏఎన్ నెంబర్లు ఉంటే జరిమానా పడుతుందా..?