HomeతెలంగాణLand Prices: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ పెంపు, ఇవాళ్టి నుంచే అమలు!

Land Prices: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ పెంపు, ఇవాళ్టి నుంచే అమలు!

రాష్ట్రంలో భూములు, ఖాళీ స్థలాలు, అపార్టుమెంట్లు, ఇళ్లకు సంబంధించిన కొత్త ప్రభుత్వ మార్కెట్ విలువలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇకపై 144 సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే అన్ని రిజిస్ట్రేషన్లు ఈ కొత్త విలువల ఆధారంగానే జరగనున్నాయి. ఇప్పటికే కార్డ్ సాఫ్ట్‌ వేర్‌ లో సవరించిన విలువలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

వ్యవసాయ భూములకు భారీగా ధర పెంపు

ప్రభుత్వం చేసిన ఈ మార్పుల్లో ప్రధానంగా మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నా, ప్రభుత్వ విలువ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెంపుదల జరిగింది. వ్యత్యాసం ఎక్కువగా ఉన్న చోట్ల వ్యవసాయ భూములు, ప్లాట్లకు 50% నుంచి 100% వరకు పెంపు చేశారు. అపార్టుమెంట్లకు మాత్రం 10% నుంచి 20% వరకు మాత్రమే పెంచారు. కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 92 వేల ప్రాంతాల్లో ఈ సవరణలు చేపట్టారు. వీటిలో ఎక్కువ భాగం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) లోపల ప్రాంతాలే ఉన్నాయి. ఈ మార్పులకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖతో పాటు ఆర్థిక నిపుణుల నివేదికలు ఆధారంగా తీసుకున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భూముల విలువలు కనిష్ఠంగా 50% నుంచి గరిష్ఠంగా 100% వరకు పెరిగాయి. కోకాపేట, నానక్‌రాంగూడ, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో భారీగా పెంపుదల జరిగింది. కొన్ని గ్రామీణ జిల్లాల్లో 50% నుంచి 75% వరకు సవరణలు చేశారు. కరీంనగర్, నిజామాబాద్ వంటి కొన్ని ప్రాంతాల్లో పాత విలువలే కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ వంటి ప్రీమియం ప్రాంతాల్లో చ.గజం ధరలు అత్యధికంగా ఉన్నాయి. ప్లాట్ల ధరలు కూడా 100% వరకు పెరిగిన చోట్ల ఉన్నాయి.

రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో నో ఛేంజెస్!

రిజిస్ట్రేషన్ రుసుము 7.5% మాత్రం మారలేదు. కానీ కొత్త విలువల ఆధారంగా రుసుము పెరగనుంది. ఉదాహరణకు, ఒక ఫ్లాట్‌పై పాత విలువతో పోలిస్తే ఇప్పుడు చెల్లించాల్సిన మొత్తం పెరుగుతుంది. ఇప్పటికే చెల్లింపులు చేసినవారికి కూడా కొత్త విలువల ప్రకారం అదనపు ఛార్జీలు చెల్లించే అవకాశం ఉంది. సందేహాల కోసం హెల్ప్‌ డెస్క్, టోల్ ఫ్రీ నంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ఈ మార్పులను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్ష చేయనుంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు