విజయవాడ, క్రైమ్ మిర్రర్ : రాజకీయాల్లో మేటి నాయకుడిగా పేరుతెచ్చుకున్న సీఎం చంద్రబాబు నాయుడు వారసత్వంగా రాజకీయాల్లో రావడం అప్పట్లో ఒక సంచలనమే అని చెప్పవచ్చు. కానీ చంద్రబాబు కుమారుడు టీడీపీ భవిష్యత్ నేతగా ఎదగాలంటే లోకేష్ ప్రతీ అడుగులో విమర్శలు, పోలికల పరీక్షలు నెగ్గాల్చి వచ్చింది. రాజకీయ ఆసక్తి ఉన్న యువకుడిగా ఆయన అర్హతలు వాటిముందు తూగలేక పోయాయి. కార్యకర్తల సంక్షేమం మొదటి భాద్యతగా పార్టీలో అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు పార్టీకి భవిష్యత్ నేతగా ఎదగటం ఆషామాషీ కాదు. 2013లో రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఆయనపై ‘వారసుడు’ అనే ముద్ర బలంగా పడింది. ప్రతిపక్షాల నుంచి ఎదురైన వ్యక్తిగత విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆయన్ని మానసికంగా దెబ్బతీయాలని చూశాయి.
ముఖ్యంగా ఆయన ప్రసంగ శైలి, తెలుగు ఉచ్ఛారణ మొదలు కొని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు చేసిన విమర్శలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. కానీ, ఒకరకంగా ఆ విమర్శలే ఆయనను రాటుదేల్చాయి. లోకేష్ తన లోపాలను సరిదిద్దుకుంటూ, మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోయారు.చంద్రబాబు నాయుడు పాలనపై దృష్టి పెట్టిన సమయంలో, పార్టీ క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని సమన్వయం చేసే బాధ్యతను లోకేష్ భుజాన వేసుకున్నారు. ‘కార్యకర్తల సంక్షేమ నిధి’ ద్వారా వేలాది మంది కార్యకర్తలకు అండగా నిలిచారు.
ఇది ఆయనకు పార్టీ కేడర్‌లో బలమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. నాయకత్వం అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం కాదు, క్లిష్ట సమయాల్లో కార్యకర్త వెనుక నిలబడటమేనని ఆయన నిరూపించారు.2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోవడం లోకేష్ రాజకీయ జీవితంలో ఒక పెద్ద కుదుపు. కానీ, ఆ ఓటమి ఆయన్ని నిరుత్సాహపరచలేదు. ఆవిర్భావం నుంచీ పార్టీ ఒక్కసారి కూడా గెలుచుకోని స్ధానాన్ని ఎంచుకోవడమే పెద్ద సవాలు. అన్నీ వడ్డించిన విస్తరిలో భుజించడం ఆయనకు తేలికే.. కానీ తన ప్రయత్నమే కార్యకర్తలకు స్పూర్తిగా నిలవాలనే యత్నమే ఆయన పట్టుదలకు నిర్దర్శనం. అందుకే గెలిచిన ప్రత్యర్థి కంటే ఎక్కువగా నియోజకవర్గంలో గడిపారు.
ఓడినా అక్కడే ఉండి ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడం ఆయన పట్టుదలకు నిదర్శనం. ఈ పట్టుదలే 2024లో అదే మంగళగిరి నుంచి రికార్డు మెజారిటీతో విజయం సాధించారు.నందమూరి, నారా వారసుడిగా లోకేష్ కు గుర్తింపు ఉన్నా.. యువ గళం పాదయాత్ర ఆయన్ను నాయకుడిగా మార్చింది. 4,000 కిలోమీటర్లకుపైగా సాగిన ఈ సుదీర్ఘ యాత్రలో అన్ని వర్గాల వారితో మమేకమయ్యారు, కార్యకర్తల మనోభావాలు తెలుసుకున్నారు. మండుటెండల్లో సైతం సాగిన ఈ యాత్రలో ఆయన తన మాట తీరును, బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మెరుగు పరచుకున్నారు. సమస్యలను అర్థం చేసుకోవడంలో లోకేష్ చూపిన చొరవ, ప్రత్యర్థుల విమర్శలకు ఆయన ఇచ్చిన కౌంటర్లు పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ పాదయాత్ర ద్వారా లోకేష్ తనను తాను ఒక మాస్ లీడర్‌గా ఆవిష్కరించుకున్నారు.
చంద్రబాబు నాయుడు అనుభవం ఒక ఎత్తయితే, లోకేష్ ఆధునికత మరో ఎత్తు. లోకేష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన టీమ్‌ను నిర్మించుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నిమ్మకాయల విజయ్ లాంటి కొత్తతరం నాయకులను ప్రోత్సహిస్తూ పార్టీలో యువ రక్తాన్ని ఎక్కిస్తున్నారు. ఎన్టీయార్, చంద్రబాబు తరం నాయకుల వారసులను చేరదీస్తూ భవిష్యత్ నాయకులతో పార్టీని సిద్దం చేస్తున్నారు.గతంలో ఐటీ, పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన కాలంలోనే లోకేష్ తన పాలనలోనూ సమర్ధత చాటుకున్నారు.
గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాలు, సీసీ రోడ్ల నిర్మాణాలతో రికార్డు స్థాయి పనులుచేసారు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఆయన దృష్టి సారించారు. రోజువారీ ప్రభుత్వ సేవల్లో సరళత తీసుకురావడం ద్వారా పనిచేసే ప్రభుత్వం అని నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టడం కేవలం పదవి దక్కించుకోవడం కాదు లక్షలాది కార్యకర్తల ఆకాంక్షలను మోసే బాధ్యత.
