తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతున్న వేళ ప్రజలకు కొంత ఊరట కలిగించేలా వాతావరణ శాఖ కీలక సమాచారం వెల్లడించింది. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో నైరుతి రుతుపవనాల కదలికలు వేగం పుంజుకుంటున్నాయని తెలిపింది. రాబోయే 2 నుంచి 3 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి-ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల వైపు మరింత ముందుకు సాగే పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం రుతుపవనాల పురోగతి సాధారణ స్థాయిలోనే కొనసాగుతోందని, కేరళలో ప్రవేశానికి కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది.
వాతావరణ శాఖ విశ్లేషణ ప్రకారం.. ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రస్తుతం దక్షిణ బీహార్ పరిసర ప్రాంతాల నుంచి జార్ఖండ్, ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతం వరకు సగటు సముద్రమట్టానికి సుమారు 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మంగళవారం, బుధవారం, గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అయితే వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని, ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలే కొనసాగవచ్చని హెచ్చరించారు. తెలంగాణలో జూన్ తొలి వారానికి నైరుతి రుతుపవనాలు చేరే అవకాశం ఉందని గత అంచనాలు కూడా సూచిస్తున్నాయి.
వాతావరణ హెచ్చరికల విషయానికి వస్తే, తెలంగాణలో ఈరోజు, రేపు కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎల్లుండి కూడా కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కొనసాగవచ్చని తెలిపారు. అదేవిధంగా ఈరోజు నుంచి వచ్చే 3 రోజుల వరకు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కూడా తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో వేడి పరిస్థితులతో పాటు వర్ష సూచనలు కొనసాగుతున్నాయని భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ వెల్లడించింది.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాల సూచనలు కనిపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అనకాపల్లి, కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కూడా వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వర్షాల సమయంలో చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని, పిడుగుల ప్రమాదాన్ని తేలికగా తీసుకోవద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉపశమనం ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు.
ALSO READ: జ్యోతిష్యం పేరిట సైబర్ మోసాలు