Homeక్రైమ్2015 మైనర్ల అక్రమ రవాణా కేసులో కీలక తీర్పు.. నిందుతులకు కఠిన శిక్షలు: ఐదుగురికి జీవిత...

2015 మైనర్ల అక్రమ రవాణా కేసులో కీలక తీర్పు.. నిందుతులకు కఠిన శిక్షలు: ఐదుగురికి జీవిత ఖైదు

హైదరాబాద్‌లో 2015లో వెలుగులోకి వచ్చిన మైనర్ల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ కేసులో ప్రత్యేక పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 33 మందిని దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం.. ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. మిగిలిన నిందితులకు కూడా కఠిన కారాగార శిక్షలు ఖరారు చేసింది.

హెచ్‌ఏసీఏ భవన్‌లోని ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఉదయ్ భాస్కర్ రావు ఈ తీర్పును ప్రకటించారు. ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు విధించగా.. మరో ముగ్గురికి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. 14 మందికి పదేళ్ల చొప్పున, మరో 11 మందికి మూడేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించారు.

కోర్టు మరో కీలక ఆదేశం కూడా జారీ చేసింది. ఈ ఘటనలో బాధితులైన తొమ్మిది మంది మైనర్ బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆదేశించింది. బాలికలు ఎదుర్కొన్న శారీరక, మానసిక వేదనను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగం పేరుతో మోసం.. వ్యభిచార కూపంలోకి

2015 జూలై 17న ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ బాలికను కొందరు వ్యక్తులు మోసపూరితంగా తీసుకెళ్లి వ్యభిచార కార్యకలాపాల్లోకి నెట్టారు. అక్కడ సుమారు నాలుగు నెలల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బాలిక.. చివరకు అక్కడి నుంచి తప్పించుకుని దర్యాప్తు అధికారులను ఆశ్రయించింది.

బాధితురాలి ఫిర్యాదుతో తెలంగాణ సీఐడీ మహిళా భద్రతా విభాగం దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా పలు వ్యభిచార కేంద్రాలపై దాడులు నిర్వహించిన అధికారులు.. 45 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి చెరలో ఉన్న తొమ్మిది మంది మైనర్ బాలికలతో పాటు మరికొంతమంది మహిళలను రక్షించారు.

సుదీర్ఘ విచారణ తర్వాత శిక్షలు

ఈ కేసులో నిందితులపై పోక్సో చట్టంతో పాటు అప్పటి ఐపీసీ నిబంధనలు, అనైతిక రవాణా నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.

ఏళ్లపాటు సాగిన విచారణలో సాక్ష్యాలు, వాంగ్మూలాలను పరిశీలించిన ప్రత్యేక న్యాయస్థానం.. 33 మందిని దోషులుగా నిర్ధారించింది. తాజాగా శిక్షలను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

also read: అందరి టార్గెట్ హరీష్…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు