జగిత్యాల జిల్లా బ్యూరో, క్రైమ్ మిర్రర్: జగిత్యాలలో గులాబీ దళపతి కేసీఆర్ భారీ బహిరంగ సభకు ముందే రాజకీయం తీవ్రంగా వేడెక్కింది. సభకు వచ్చే జన ప్రవాహాన్ని చూసి భయపడుతున్న రేవంత్ సర్కార్… అభివృద్ధి పనుల ముసుగులో ఏకంగా రోడ్లనే తవ్వేసి దిగజారుడు రాజకీయాలకు తెరతీసిందని బీఆర్ఎస్ భగ్గుమంటోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరుతుండటంతో, ఆ దెబ్బను జీర్ణించుకోలేకనే రేవంత్ ప్రభుత్వం ఈ కుట్రలు పన్నుతోందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
హైవేపై కందకాలు…
ఏప్రిల్ 20న జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగనుంది. అయితే కోరుట్ల, మెట్‌పల్లి, నిజామాబాద్ జిల్లాల నుంచి జనాలు భారీగా రాకుండా అడ్డుకునేందుకు, నేషనల్ హైవే-563 పై కల్వర్టుల విస్తరణ పేరుతో అధికారులు అకస్మాత్తుగా రోడ్డును అడ్డంగా తవ్వేశారు.ఎమ్మెల్యే సంజయ్ ఫైర్: కనీసం కేసీఆర్ సభ పూర్తయ్యే వరకైనా ఈ పనులు వాయిదా వేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పదేపదే కోరినా అధికారులు పెడచెవిన పెట్టారు. కేవలం ప్రజలను ఇబ్బంది పెట్టి సభను ఫ్లాప్ చేయాలనేదే కాంగ్రెస్ కుట్ర అని ఆయన నిప్పులు చెరిగారు.
జనాలకు నరకం…
రోడ్డును కట్ చేయడం వల్ల కోరుట్ల నుంచి జగిత్యాలకు వచ్చే ప్రజలు బైపాస్ రోడ్డు మీదుగా 5 నుండి 6 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సిన దుస్థితి ఏర్పడింది.కాలి నడకనైనా వెళ్తామన్న కేడర్: కాంగ్రెస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, రోడ్లు తవ్వేసినా సరే… అవసరమైతే కాలి నడకనైనా కేసీఆర్ సభకు వెళ్లి తీరుతామని బీఆర్ఎస్ కార్యకర్తలు అధికార పార్టీకి సవాల్ విసురుతున్నారు.ప్రజాస్వామ్యంలో సభలు, సమావేశాలు జరుపుకునే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది.
కానీ కల్వర్టుల విస్తరణ అనే ముసుగులో ప్రతిపక్షాల సభలకు అడ్డంకులు సృష్టించడం రాజకీయ కక్షసాధింపు చర్యగానే కనిపిస్తోంది. సభను ఎదుర్కోలేక అడ్డదారులు తొక్కుతున్నారన్న విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుంటోంది. ఇది రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న తీవ్ర స్థాయి పొలిటికల్ వార్ కు అద్దం పడుతోంది!
