Homeఅంతర్జాతీయంకల్కి భగవాన్ కన్నుమూత...!

కల్కి భగవాన్ కన్నుమూత…!

  • సామాన్య ఎల్ఐసి క్లర్క్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా..

  • ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు

  • ఆశ్రమం చుట్టూ ఎన్నెన్నో వివాదాలు, ఐటీ దాడులు

  • ఆధ్యాత్మిక గురువు మరణంతో అంతటా విషాదం

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: ఆయన ఓ సామాన్య క్లర్క్.. ఎల్ఐసి లో ఒక సాధారణ ఉద్యోగి. కానీ తరువాత ఆధ్యాత్మిక వేత్తగా, విద్యావేత్తగా మారారు. తనను తాను కల్కి అవతారంగా ప్రకటించుకున్నారు. ఆయన భార్య అమ్మా భగవాన్ పేరుతో అందరికీ సుపరిచితులయ్యారు.

నాలుగున్నర దశాబ్దాలుగా కల్కి భగవాన్ గా భక్తులతో పూజలు అందుకున్నారు. సమాజంలో ఆధ్యాత్మిక గురువుగా పేరు సంపాదించారు. ఆయనే కల్కి భగవాన్ అలియాస్ విజయ్ కుమార్ నాయుడు. తీవ్ర అనారోగ్య సమస్యలతో కల్కి భగవాన్ చనిపోయారు.

చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తమిళనాడులో జన్మించిన ఆయన ఎల్ఐసి లో క్లర్కుగా తన ఉద్యోగ ప్రస్తానాన్ని ప్రారంభించారు. కానీ తరువాత ఆధ్యాత్మికత వైపు వెళ్లి ప్రపంచవ్యాప్తంగా భక్తులను సంపాదించుకున్నారు.

దేశ విదేశాల్లో కూడా ఆయనకు భక్తులు ఉన్నారు. కల్కి భగవాన్ చుట్టూ అనేక వివాదాలు, ఐటీ దాడులు కూడా వెంటాడాయి. ఆయన మరణంతో భక్తులు విషాదంలో మునిగిపోయారు.

  • పది రోజుల కిందట అస్వస్థత..

పది రోజుల కిందట తీవ్ర అస్వస్థతకు గురయ్యారు కల్కి భగవాన్. దీంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు కల్కి భగవాన్. ఆయన మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తుల వల్లంలోని ఏకం ఆలయమైన గోల్డ్ సిటీకి తరలించారు.

శనివారం కల్కి భగవాన్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఏకం ఆలయంలోనే సమాధి చేయనున్నారు. గురుదేవుల మృతితో భక్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆధ్యాత్మిక బోధనలు, సేవలను స్మరించుకుంటూ భక్తులు గురుదేవులకు నివాళులు అర్పిస్తున్నారు.

  • తమిళనాడు స్వస్థలం..

కల్కి భగవాన్ అసలు పేరు విజయ్ కుమార్ నాయుడు. 1949లో తమిళనాడులో జన్మించారు. అక్కడే చదువుకున్నారు. ఎల్ఐసి క్లర్కు గా కూడా పనిచేశారు. 1977లో ఆయనకు పద్మావతితో వివాహం జరిగింది. అనంతరం ఆయన ఆధ్యాత్మికత, విద్య వైపు అడుగులు వేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం రాజుపేట దగ్గర జీవాశ్రమం పేరుతో ఒక రెసిడెన్షియల్ స్కూల్ ను ప్రారంభించారు.

1990 ప్రాంతంలో తనను కల్కి అవతారం అని ప్రకటించారు. ఆయన భార్య పద్మావతి అమ్మ భగవాన్ పేరుతో అందరకు పరిచయం అయ్యారు. అనంతరం 2500 కోట్ల రూపాయలతో తెల్లటి పాలరాతి నిర్మాణంతో ఆలయం 2005లో ప్రారంభం అయింది.

తమిళనాడులోని తిరువల్లూరు దగ్గర నేమం ప్రాంతంలో కల్కి భగవాన్ గా ఆధ్యాత్మిక బోధనలు ప్రారంభించారు. అటు తరువాత తిరుపతి జిల్లా వరదయ్యపాలెం పంచాయితీ గోవర్ధనపురంలో కల్కి గ్రామీణ అభివృద్ధి ట్రస్ట్ ప్రారంభించారు. కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు.

  • విరివిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు..

ప్రపంచవ్యాప్తంగా కల్కి భగవాన్ తో పాటు అమ్మ భగవాన్ కు లక్షలాదిమంది భక్తులు ఉన్నారు. కల్కి భగవాన్ ఆశ్రమాల్లో విదేశీ భక్తులతో పాటు దేశ నలుమూలల నుంచి వచ్చేవారు ఉంటారు. వీరికి ధ్యానం, ముక్తి దీక్షా తదితర ఆధ్యాత్మిక తరగతులు నిర్వహించేవారు. కల్కి పేరుతో గ్రామీణ అభివృద్ధి, వన్నెస్ హ్యూమన్, లోక ఫౌండేషన్, ముక్తి వంటి పలు ట్రస్టులు ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఏకం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కల్కి భగవాన్ ట్రస్టుల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వందలాది గ్రామాల్లో తాగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేద ప్రజల కోసం ఆసుపత్రులు, ఉచిత వైద్య శిబిరాలు, కంటి ఆపరేషన్ శిబిరాలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అనేక రకాల మౌలిక వసతులు కల్పించారు.

  • అనేక వివాదాలు..

కల్కి భగవాన్ ఆశ్రమాలు పై అనేక రకాల వివాదాలు వచ్చాయి. ఆయన ఆస్తులు, ఆశ్రమాలపై ఐటి దాడులు కూడా జరిగాయి. 2008లో కల్కి భగవాన్ ఆశ్రమంలో నిర్వహించిన కార్యక్రమానికి భారీగా భక్తులు వచ్చారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగి చాలామంది చనిపోయారు.

2019 అక్టోబర్లో ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపాయి. డబ్బులతో పాటు విదేశీ కరెన్సీ, కిలోల కొద్దీ బంగారం అప్పట్లో బయటపడింది. ఇలా లక్షలాదిమంది భక్తులు, మధ్యలో వివాదాలను చవిచూసిన కల్కి భగవాన్ మృతి చెందడం బాధాకరం. భక్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు