క్రైమ్ మిర్రర్, సినిమా:- తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన జన నాయకుడు (తమిళంలో జన నాయగన్) విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రానికి ఇది రీమేక్ అనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. తాజాగా ఈ వార్తలపై దర్శకుడు హెచ్. వినోత్ స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. సినిమా పూర్తిగా భగవంత్ కేసరి కాపీ కాదని, కథలో గణనీయమైన మార్పులు చేశామని స్పష్టం చేశారు.
దర్శకుడు హెచ్. వినోత్ మాట్లాడుతూ.. మొదట విజయ్ కోసం పూర్తిగా కొత్త కథను సిద్ధం చేశానని తెలిపారు. రెండు మేధావుల మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఆ కథ సాగుతుందని, అయితే ఆ స్క్రిప్ట్ చాలా హెవీగా ఉందని విజయ్ భావించారని చెప్పారు. దానికి బదులుగా భగవంత్ కేసరి కథను తమ శైలిలో తెరకెక్కిద్దామని విజయ్ సూచించడంతో రీమేక్‌కు అంగీకరించినట్లు వెల్లడించారు.
తారక్ సరసన గాడ్ ఆఫ్ వార్ కోసం బోల్డ్ బాలీవుడ్ హీరోయిన్!
తాను ఇప్పటికే పింక్ చిత్రాన్ని అజిత్‌తో నేర్కొండ పార్వై పేరుతో రీమేక్ చేశానని, మరోసారి రీమేక్ చేయాలనే ఆలోచన మొదట ఇబ్బందిగా అనిపించిందని వినోత్ తెలిపారు. అయినప్పటికీ విజయ్ చివరి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని వదులుకోవాలని అనుకోలేదని చెప్పారు. అందుకే ఒరిజినల్ కథను పూర్తిగా కాపీ చేయకుండా, విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో అనేక మార్పులు చేశామని వివరించారు.వినోత్ చెప్పిన ప్రకారం, సినిమా ఫస్ట్ హాఫ్‌లో దాదాపు 60 శాతం వరకు భగవంత్ కేసరిని పోలి ఉండే సన్నివేశాలు కనిపిస్తాయి. అయితే సెకండ్ హాఫ్‌లో కేవలం 20 శాతం మాత్రమే ఒరిజినల్ చిత్రాన్ని పోలి ఉంటుందని, మిగతా భాగాన్ని పూర్తిగా కొత్తగా రూపొందించామని తెలిపారు. రీమేక్ అంటే సీన్ టు సీన్ కాపీ చేయడం కాదని, కథను కొత్త కోణంలో చెప్పడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.విజయ్ మహిళా సాధికారతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని, అందుకే ఈ కథలోని ప్రధాన భావం ఆయనను ఆకట్టుకుందని వినోత్ చెప్పారు. అలాగే అజిత్‌తో పని చేసినప్పుడు చూసిన క్రమశిక్షణనే విజయ్‌లో కూడా చూశానని వెల్లడించారు. విజయ్ అభిమానులు గర్వపడేలా ఈ చిత్రాన్ని రూపొందించామని ఆయన అన్నారు.
ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, భగవంత్ కేసరిలో శ్రీలీల పోషించిన పాత్రను మమితా బైజు పోషించింది. విలన్‌గా బాబీ డియోల్ నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్నాయి. జూలై 23న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయోధ్య రామమందిరం: విరాళాల లెక్కింపులో భారీ మార్పు… ఎస్‌బీఐ పర్యవేక్షణతో మరింత పారదర్శకత