కామారెడ్డి, క్రైమ్ మిర్రర్: వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాలు చిన్నా భిన్నామవుతున్న ఘటనలు మనం రోజు వింటూనే ఉన్నాం. తాజాగా ప్రియుడి మోజులో పడి దారుణ నిర్ణయం తీసుకుంది. భీమా సొమ్ము కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కెల్ గ్రామానికి చెందిన కంచర్ల రాజయ్య, రేణుక దంపతులు. రేణుక, గంగాశేఖర్ అనే వ్యక్తితో గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తను హత్య చేస్తే అడ్డు తొలగిపోతుందని, అలాగే భీమా డబ్బులు కూడా వస్తాయని ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది.
పథకంలో భాగంగా మే 21వ తేదీన రాజయ్యకు మద్యం తాగించి, తిర్మన్ పల్లి శివారులో తలపై రాడ్తో కొట్టి హత్య చేసి రోడ్డు ప్రమాదంగా గంగాశేఖర్ చిత్రీకరించాడు. రాజయ్య పొలం పనులకు వెళ్తుండగా గుర్తు తెలియని జంతువు అడ్డు రావడంతో, వాహనం అదుపుతప్పి కిందపడి మృతి చెందాడని భార్య రేణుక పోలీసులకు తెలిపింది. రేణుక తీరుపై అనుమానం వచ్చి విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. దీంతో ప్రియుడు గంగాశేఖర్, రేణుకను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.