చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభం, నేరుగా కాశ్మీర్ కు వందేభారత్ పరుగులు!

0
212
India opens world's highest single arch railway bridge in Kashmir
India opens world's highest single arch railway bridge in Kashmir

Chinab Bridge: భారతీయ రైల్వేలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది.చీనాబ్‌ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెనను ప్రధాని మోడీ ప్రారంభించారు. రూ.1,486 కోట్ల వ్యయంతో 8 ఏళ్లపాటు కష్టపడి నిర్మించిన ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రారంభం అనంతరం జాతీయ జెండాను పట్టుకొని ప్రధాని ఈ వంతెనపై నడిచారు. ఆ తర్వాత అంజి నదిపై నిర్మించిన దేశంలోనే తొలి కేబుల్‌ రైలు వంతెనను కూడా ప్రధాని ప్రారంభించారు. అనంతరం జమ్మూలోని కత్రా నుంచి  కాశ్మీరుకు తొలి వందే భారత్‌ రైలును జెండా ఊపి అందుబాటులోకి తీసుకొచ్చారు.

పహల్గామ్ దాడి తర్వాత తొలి పర్యటన

పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోడీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఉధంపుర్‌లోని వైమానిక కేంద్రంలో దిగిన ఆయన, వంతెన ప్రారంభానికి ముందు దాన్ని పరిశీలించారు. ఆ తర్వాత చీనాబ్‌, అంజిఖాడ్ వంతెనలపై పరుగులు తీసిన వందేభారత్‌ రైలులో ప్రయాణించారు. అనంతరం కత్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. చీనాబ్‌ వంతెన ప్రారంభోత్సవం జమ్మూకశ్మీర్‌ అభివృద్ధికి ప్రతిబింబమన్నారు. ఉధంపూర్‌- శ్రీనగర్‌- బారాముల్లా రైలు లింకు ప్రాజెక్టు ఆధునిక, సాధికార జమ్మూకాశ్మీరుకు సంకేతమన్నారు. ఈ ప్రాజెక్టుతో  దేశంలోని అన్ని ప్రాంతాలతో కశ్మీరుకు రైలు అనుసంధానం ఏర్పడిందన్నారు. కాశ్మీర్ కు నేరుగా రైల్వే కనెక్టివిటీ ఏర్పడటంతో ఆ ప్రాంతం పర్యాటకంగా, ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది.

ఇంజినీరింగ్ అద్భుతం చీనాబ్‌ వంతెన

చీనాబ్ రైల్వే వంతెన ఇంజినీరింగ్ అద్భుతంగా నిలిచింది. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఈ ఆర్చి వంతెనను నిర్మించారు. దీని పొడవు 1.315 కిలోమీటర్లు. పారిస్ లోని ఈఫిల్‌ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 35 మీటర్లు ఎక్కువ. అతివేగమైన గాలులు, భూకంపాలు, వరదలు, బాంబు పేలుళ్లను సైతం ఈ వంతెన తట్టుకుంటుంది. ఈ బ్రిడ్జి ప్రారంభంతో జమ్మూ నుంచి శ్రీనగర్‌కు ప్రయాణ సమయం సుమారు 3 గంటలు తగ్గుతుంది. ఈ వంతెన జీవితకాలం 120  ఏళ్లు ఉంటుంది. దీనిపై గరిష్ఠంగా 100 కి.మీ. వేగంతో రైలు ప్రయాణించవచ్చు. 2002లో వాజ్‌పేయి హయాంలో ఈ ప్రాజెక్ట్‌ కు రూపకల్పన చేయగా.. 23 ఏళ్ల తర్వాత ఇది పూర్తయింది.

Read Also: రూ.1.50 లక్ష ల వరకు ట్రీట్మెంట్ ఫ్రీ, యాక్సిడెంట్ బాధితులకు కేంద్రం ఆసరా!