HomeజాతీయంRafael Jets Deal: మరో 114 రఫేల్ జెట్స్ కొనుగోలు.. త్వరలో భారత్ గ్రీన్ సిగ్నల్!

Rafael Jets Deal: మరో 114 రఫేల్ జెట్స్ కొనుగోలు.. త్వరలో భారత్ గ్రీన్ సిగ్నల్!

Big Boost to Air Force: ఫ్రాన్స్ నుంచి భారత్ మరో 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది. రక్షణ శాఖ మంత్రి సారథ్యంలోని డిఫెన్స్ అక్విసిషన్ కౌన్సిల్ త్వరలో ఈ ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  ఈ నెలలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ టూర్‌కు మునుపే రఫేల్ కొనుగోలు ప్రతిపాదనకు డీఏసీ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో జరగనున్న డీఏసీ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ పడొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత నెలలోనే రక్షణ శాఖ సెక్రటరీ సారథ్యంలోని డిఫెన్స్ ప్రొక్రూర్మెంట్ బోర్డు ఈ డీల్‌ను క్లియర్ చేసిందట.

మొత్తం డీలు విలువ రూ.3.25 లక్షల కోట్లు

ఈ డీల్ విలువ సుమారు రూ.3.25 లక్షల కోట్లు ఉండొచ్చని సమాచారం. యుద్ద విమానాల కొరత నెలకొన్న నేపథ్యంలో ఈ డీల్ భారత వాయుసేనకు కీలకం కానుంది. ఇందులో భాగంగా 18 విమానాలను తక్షణ వినియోగానికి అనువైన స్థితిలో భారత్ దిగుమతి చేసుకుంటుంది. మిగిలిన 80 శాతం విమానాలను భారత్‌లోనే తయారు చేయనున్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యాచరణలో భాగంగా ఈ విమానాల్లో సుమారు 60 శాతం స్వదేశీ విడి భాగాలను వినియోగించనున్నారు. మొత్తం విమానాల్లో 88 సింగిల్ సీట్, 26 ట్విన్ సీట్ వేరియంట్లు ఉండనున్నాయి. ఈ దిశగా రఫేల్ జెట్ తయారీదారు డసో ఏవియేషన్ భారతీయ ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోనుంది.

42 యుద్ధ విమానాల స్క్వాడ్రన్స్‌ అవసరం  

భారత వాయుసేనకు మొత్తం 42 యుద్ధ విమానాల స్క్వాడ్రన్స్‌ అవసరం. కానీ, ప్రస్తుతం 29 ఫైటర్ స్క్వాడ్రన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పశ్చిమ సరిహద్దు, ఇటు ఉత్తర సరిహద్దు నుంచి సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో త్వరితగతిన ఫైటర్ జెట్స్‌ను సమకూర్చాలని వాయుసేన కేంద్రాన్ని కోరుతోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు