హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ద్విచక్ర ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలు చేసే వారికి గతంలో 10000 చొప్పున సబ్సిడీని ప్రభుత్వం అందించేది. అయితే ఈ మధ్యకాలంలో ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెంచడంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు కూడా తగ్గించింది. ప్రస్తుతం రూ.5000 రూపాయలు సబ్సిడీగా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలకు అందిస్తోంది. అయితే దేశంలో వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు ఉపశమనం కలిగించే వార్తను అందించింది.
దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచే ఉద్దేశంతో ఈ వాహనాల కొనుగోలు చేసే వినియోగదారులకు అందించే సబ్సిడీని పెంచాలని భావిస్తోంది. ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రస్తుతం రూ.5000 అందిస్తున్న సబ్సిడీని మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఈ మొత్తాన్ని పదివేలకు పెంచుతారా.? అంతకుమించే పెంచుతారా.? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సబ్సిడీ పెంపు నిర్ణయం మాత్రం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుందని, కొద్దిరోజుల్లోనే అమలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
పీఎం ఈ డ్రైవ్ పథకం కింద వాహనదారులకు సబ్సిడీ…
కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే వారికి పీఎం ఈ డ్రైవ్ పథకం కింద సబ్సిడీ అందిస్తోంది. దేశంలో పర్యావరణ రహిత రవాణాను ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం గతంలో శ్రీకారం చుట్టింది. 2024లో పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని ప్రధాని ప్రారంభించినప్పుడు 24.7 లక్షల ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలను సబ్సిడీ కింద ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈనెల 24 నాటికే 23.5 లక్షల వాహనాలను సబ్సిడీ కింద అందించినట్లు ప్రభుత్వం చెబుతోంది. గత ఆర్థిక సంవత్సరం చివరివరకు పీఎం ఈ డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సబ్సిడీ కోసం రూ.10,900 కోట్లు కేటాయించుగా వాటిని జూలై చివరి వరకు పొడిగించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ మేరకు ఈ పథకానికి కేవలం రూ.1500 కోట్లు మాత్రమే కేటాయించారు.
అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని మరింత పెంచాలని యోచిస్తున్న నేపథ్యంలో దీనికి మరిన్ని నిధులను కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త ప్రతిపాదన అమలులోకి వస్తే బడ్జెట్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలకు అందించనున్న సబ్సిడీపై వచ్చేనెల తొలి వారంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలుబడుతుంది అని చెబుతున్నారు. అదే జరిగితే దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినెల వినియోగదారులపై భారీ మొత్తంలో భారం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రికల్ వాహనాల వైపు వినియోగదారులు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పెంపు నిర్ణయానికి తీసుకుంటే ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల కొనుగోలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.