క్రైమ్ మిర్రర్ : కర్ణాటకలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్యను పుట్టింటి నుంచి తీసుకువచ్చి ఉరివేసి హత్య చేశాడు. దానికి ముందు ఉరితాడు మెడకు బిగుసుకుని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా ఏ మాత్రం కనికరం లేకుండా తన అత్తమామలకు వీడియో కాల్ చేసి మీ కూతురు ప్రత్యక్ష నరకం ఇదిగో అంటూ ఆ దారుణాన్ని చూయిస్తూ రాక్షసానందం పొందాడు. ఈ ఘటన బాగల్కోట్ జిల్లాలో చోటు చేసుకోగ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. భాగ్యశ్రీ జిగళూరు (23), ప్రవీణ్ జిగళూరు దంపతులు. కొంతకాలంగా వీరి మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న ప్రవీణ్ తరచూ ఆమెను వేధించేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త వేధింపులు తాళలేక భాగ్యశ్రీ రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లినట్లు సమాచారం. ఇటీవల ప్రవీణ్ ఆమె వద్దకు వెళ్లి ఇకపై ఎలాంటి గొడవలు ఉండవని, ప్రశాంతంగా చూసుకుంటానని నమ్మించాడు. దీంతో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను తిరిగి తన ఇంటికి తీసుకెళ్లాడు.
అయితే ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే మళ్లీ భార్యతో గొడవకు దిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కోపంతో ప్రవీణ్ ఆమెపై దాడి చేశాడని, అనంతరం ఇంట్లోనే ఆమెను ఉరికి వేలాడదీశాడు. అంతటితో ఆగకుండా, భార్య ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి ఘటనను చూపించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వీడియోను మరికొందరికి కూడా పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో భాగ్యశ్రీ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
also read : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ దుర్మరణం
