వరంగల్‌లో కాకతీయుల కాలం నాటి చారిత్రక శివాలయం కూల్చివేత ఘటనపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో బడులకు.. గుడులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భగవంతుడంటే భక్తిగానీ.. భయంగానీ లేవని దుయ్యబట్టారు. గతంలో దేవుళ్లపై ఒట్టేసి రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను నిలువునా మోసం చేసిన చరిత్ర రేవంత్‌ది అని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో దేవాలయాలను అత్యంత వైభవంగా అభివృద్ధి చేస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని కూలగొడుతూ చారిత్రక సంపదను ధ్వంసం చేస్తోందని ధ్వజమెత్తారు.
కాకతీయ గణపతి దేవుడు నిర్మించిన అద్భుతమైన శివాలయాన్ని గుప్తనిధుల కోసమే ఉద్దేశపూర్వకంగా అర్థరాత్రి వేళ కూల్చేశారని హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డికి కూల్చడం అనేది ఒక అలవాటుగా మారిందని.. హైడ్రా పేరుతో ఇప్పటికే పేదల ఇళ్లను.. వారి బతుకులను రోడ్డున పడేశారని విమర్శించారు. నిజాం కట్టడాల చుట్టూ లంకెబిందెలు ఉన్నాయని గతంలోనే వెతికించిన రేవంత్.. ఇప్పుడు కాకతీయులు ఏలిన ఓరుగల్లుపై పడ్డారని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి బాధ్యతల్లో ఉన్న ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఈ తవ్వకాలు జరిగాయని ఆయన బాంబు పేల్చారు. ఈ అకృత్యం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని స్పష్టం చేశారు.
శివాలయ గర్భగుడి కింద ఏకంగా 24 అడుగుల లోతున కందకం తవ్వారంటే అది గుప్తనిధుల వేట కాక మరేమిటని హరీశ్ రావు ప్రశ్నించారు. ఆ తవ్వకాల్లో ఎలాంటి సంపద దొరికింది.. వాటిని ఎక్కడికి ఎత్తుకెళ్లారో ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో సదరు శివాలయం భూమిని దేవాదాయ శాఖ భూమిగా రికార్డుల్లో నమోదు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ‘భూభారతి’ పోర్టల్‌లో దానిని ప్రభుత్వ భూమిగా ఎందుకు మార్చారో చెప్పాలన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను కావాలని మరో చోటు నుండి ఇక్కడికి మార్చడం వెనుక లంకెబిందెల వేట దాగి ఉందని నిలదీశారు.
ఈ వ్యవహారంలో అధికారులు అసత్యాలు చెబుతూ బుకాయిస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పురావస్తు శాఖ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తవ్వకాలకు ఉపయోగించిన భారీ మెషినరీని సీజ్ చేయాలని.. యుద్ధప్రాతిపదికన కూల్చివేసిన దేవాలయాన్ని పునరుద్ధరించాలని కోరారు. దేవాలయ స్థలాన్ని తక్షణమే పురావస్తు శాఖకు అప్పగించి.. బయటపడ్డ గుప్తనిధులపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. చారిత్రక వారసత్వ సంపదను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలాంటి నేరాలకు పాల్పడటం అత్యంత దారుణమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన కాకతీయ కట్టడాలను కూల్చివేస్తున్న తీరుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని హరీశ్ రావు హెచ్చరించారు. ఆలయ కూల్చివేతకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించే వరకు తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రాలను రాజకీయ స్వార్థం.. గుప్తనిధుల ఆశ కోసం నాశనం చేయడం క్షమించరాని నేరమని అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ దేవాలయాల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని.. తగిన సమయంలో బుద్ధి చెబుతారని హరీశ్ రావు హెచ్చరించారు.
ALSO READ: తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు సమానమే.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన