Homeతెలంగాణనల్లగొండలో ఇంధన 'మంట'.. యంత్రాంగానికి లేని మమకారం..!

నల్లగొండలో ఇంధన ‘మంట’.. యంత్రాంగానికి లేని మమకారం..!

  • నల్లగొండలో ఇంధన ‘మంట’..

  • యంత్రాంగానికి లేని మమకారం..

  • స్పందన కరువైన వేళ జనం ఆగ్రహం!

​నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): ​నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాలలో, మండల కేంద్రాలలో పెట్రోల్ బంకుల వద్ద, కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతుండటంతో, సామాన్య ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. కేవలం వాహనాలే కాకుండా, బాటిళ్లు, ప్లాస్టిక్ క్యాన్లతో గంటల తరబడి నిరీక్షిస్తున్న జనాలతో, బంకుల ప్రాంగణాలు కిక్కిరిసిపోతున్నాయి. ఈ రద్దీ కాస్తా ప్రధాన రహదారులపైకి మళ్లడంతో, పట్టణాల్లో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. అంబులెన్స్‌లు, సైతం ఈ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా రంగంపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ అధికారుల వాహనాలు, నిత్యావసర సరుకులను చేరవేసే లారీలు కూడా ఇంధనం కోసం క్యూలైన్లలో వేచి ఉండాల్సి రావడంతో, సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. విధులకు వెళ్లే ఉద్యోగులు, అత్యవసర పనులపై బయటకు వచ్చే సామాన్యులు పెట్రోల్ దొరకక సగం దారిలోనే ఆగిపోతున్నారు. ఈ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో, వాహనదారులు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. పెట్రోల్ ధరల పెరుగుదల ఒక ఎత్తయితే, అసలు ఇంధనమే లభించకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

​ఈ సంక్షోభంపై పౌరసరఫరా శాఖ, జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇంధన నిల్వల లభ్యతపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వల్ల, ప్రజల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. జిల్లా యంత్రాంగం చొరవ తీసుకుని ఆయిల్ కంపెనీలతో సమీక్ష నిర్వహించి, బంకులకు నిరంతర సరఫరా జరిగేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రద్దీని నియంత్రించడానికి బంకుల వద్ద అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. అధికారులు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పర్యటించి, కృత్రిమ కొరత సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకుని, ఈ పెట్రో కష్టాల నుండి జిల్లా ప్రజలకు విముక్తి కలిగించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు