మార్కెట్‌లోకి వస్తున్న ప్యాకేజ్డ్ ఫుడ్ ఉత్పత్తులపై “ఫిట్”, “జీరో మైదా”, “ప్లాంట్ బేస్డ్”, “హెల్తీ” వంటి ఆకర్షణీయమైన పదాలు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పదాలు చూసి చాలా మంది అవి నిజంగా ఆరోగ్యానికి మంచివని నమ్మి కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ విధమైన మార్కెటింగ్ పద్ధతుల వెనుక ఉన్న వాస్తవాలపై దేశీయ ఆహార నియంత్రణ సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కఠినంగా స్పందించింది.
ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం–2006 నిబంధనలను అతిక్రమిస్తూ వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉత్పత్తుల పేర్లు, హెల్త్ క్లెయిమ్స్ ఉపయోగిస్తున్న కంపెనీలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ దృష్టి సారించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ బ్రాండ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఈ లిస్ట్ లో ఇమామి హెల్తీ & టేస్టీ, హెల్త్ ఎయిడ్, ట్రూవీ, ది హెల్తీ ఫ్యాక్టరీ, హెల్తీ మాస్టర్, హెల్తీ ఛాయిస్, ప్లాన్ బి, నుహెర్బ్స్ వంటి కంపెనీలతో పాటు వంట నూనెల విభాగంలో ప్రసిద్ధి చెందిన ఇమామి హెల్తీ & టేస్టీ బ్రాండ్‌పై నియంత్రణ సంస్థ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. “హెల్తీ & టేస్టీ” అనే పేరు వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉందని, ఇది నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు.
ఇక నుహెర్బ్స్ కంపెనీ విక్రయిస్తున్న “ట్రూ విటమిన్” ఉత్పత్తులపై కూడా ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. “ట్రూ విటమిన్” అనే పదానికి చట్టపరమైన నిర్వచనం లేకపోయినా, ఈ పేరుతో వినియోగదారుల్లో అపోహలు కలిగిస్తున్నారని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది.
డైట్ ఫుడ్ పేరుతో మార్కెట్‌లో ఉన్న కొన్ని ఉత్పత్తులపై కూడా విచారణ జరిగింది. “జీరో మైదా హోల్ వీట్ బ్రెడ్” వంటి ఉత్పత్తులపై ఉన్న క్లెయిమ్స్ వాస్తవానికి సరిపోవడం లేదని అధికారులు గుర్తించారు. అదే విధంగా “హెల్తీ చిప్స్” పేరుతో అమ్ముతున్న ఉత్పత్తులు సాధారణంగా నూనెలో వేయించినవే కావడంతో వాటిని ఆరోగ్యకరమైనవిగా చూపించడం తప్పుదోవ పట్టించే ప్రకటనగా తేల్చారు.
ఈ నేపథ్యంలో సంబంధిత కంపెనీలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. వారు ఇచ్చే సమాధానాల ఆధారంగా జరిమానాలు లేదా ఇతర చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని హెచ్చరించింది.
వినియోగదారులు కూడా ప్యాకేజింగ్‌పై ఉన్న ఆకర్షణీయ పదాలను నమ్మే ముందు పదార్థాల వివరాలు, పోషక విలువలను పరిశీలించడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.
also read: కార్పొరేట్ జాబ్ వదిలి క్యాబ్ డ్రైవింగ్… నెలకు ఆదాయం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు !